హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR)పై జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR) మీద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మిగతా వాళ్లు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ యువతి కారులో ఇరుక్కుపోయింది. ఆమెను ఓఆర్ఆర్ సిబ్బంది అతి కష్టం మీద వెలికి తీశారు.
కారు అతి వేగంగా దూసుకెళ్లి ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. Road Accident జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ఓఆర్ఆర్ మీద ఈ ప్రమాదం జరిగింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Moinabad Road Accident : మొయినాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో కారు డ్రైవర్ అరెస్ట్..
తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాదులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండో అమ్మాయి శనివారం మరణించింది. దీంతో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. మరో అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతన్నారు.
మొయినాబాదులో ఆదివారంనాడు ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. దాంతో ప్రేమిక అనే అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. మరో అమ్మాయి సౌమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మూడో అమ్మాయి ఆక్షర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.
ప్రమాదానికి గురైన ముగ్గురు అమ్మాయిలు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. వారు అన్నదమ్ముల పిల్లలు. దీంతో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ సందీప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
