హైదరాబాద్ నగరంలో ఆధార్ నోటీసుల కలకలం రేగింది. మీ పౌరసత్వం నిరూపించుకోండంటూ ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేయడం గమనార్హం. భారత్ కి చెందినవారేనని నిరూపించే ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం గమనార్హం. నోటీసులందుకున్న వారంతా గురువారం ఆధారాలతో సహా హాజరుకావాలని ఆదేశించారు.

వారంతా తప్పుడు సమాచారంతో ఆధార్ పొందినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో  చాలామందికి ఇలాంటి నోటీసులు అందినట్లు సమాచారం.  బాలాపూర్ లోని రాయల్ గార్డెన్స్ కి విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే చర్యలు తప్పవని ఆధార్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read డిసెంబర్ 31 లోగా పాన్-ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి.

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. నగరంలోని పలువురికి ఆధార్ సంస్థ ఇలాంటి షాకివ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.  తొలుత సత్తర్ ఖాన్ అనే వ్యక్తి కి నోటీసులు అందాయి.  నువ్వు భారత పౌరుడివి కాదని.. నకిలీ ధృవపత్రాలను సృష్టించి ఆధార్ కార్డ్ తీసుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆధార్ సంస్థ పేర్కొంది.

ఈ నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 20న రంగారెడ్డిలోని బాలాపూర్‌లో ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట హాజరై అన్ని ఒరిజినల్ ధృవపత్రాలను చూపించాలని ఆదేశించింది. ఒకవేళ భారత పౌరుడివి కాకుంటే.. దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించినట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని UIDIA తేల్చిచెప్పింది. 

ఒకవేళ విచారణ రాకుంటే సుమోటాగా తాము నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. తొలుత ఒక్క వ్యక్తికి మాత్రమే నోటీసులు రాగా... తాజాగా చాలా  మందికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. కాగా.. యూఐడీఏఐకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో సదరు అధికారులు స్పందించారు. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో   ఆధార్ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. అక్రమ వలసదారులకు ఆధార్‌ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టు చెబుతోందన్నారు.

ఇక ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు భారత్‌లో 182 రోజులపాటు నివసించాలన్న నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒరిజినల్‌ ధృవపత్రాలు సమకూర్చుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విచారణను మే నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది