రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌  వెలుగుచూసింది. బంగ్లాదేశ్‌లో బతుకుదెరువు లేక అక్రమంగా భారత్‌కు వలస వచ్చిన బంగ్లాదేశ్‌ యువతులకు డబ్బు ఎరవేసి వ్యభిచార కూపాల్లోకి దింపుతున్నారు. వీరిని ఉపాధి ఆశచూపి అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. 

అసలు విషయం తెలియక వచ్చి ఇరుక్కుపోయిన వారు.. తిరిగి వెళ్లలేక, అక్కడ కుటుంబ పరిస్థితులు గుర్తుకొచ్చి ఇష్టం లేకున్నా నిర్వాహకులు చెప్పినట్టు చేస్తున్నారు. చదువు రాకపోవడం, బెంగాళీ తప్ప వేరే భాష తెలియకపోవడం వీరికి మరో మైనస్ గా మారుతుంది. 

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వెలుగుచూసిన హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌  బంగ్లాదేశ్‌ యువతుల బాధలకు అద్దం పడుతోంది. బంగ్లాదేశ్‌లో పేదరికం, నిరక్షరాస్యత ఈ విపరీతమైన పరిస్థితికి దారి తీస్తోంది. బంగ్లాదేశ్ నుండి భారత్‌కు అక్రమంగా వచ్చిన కొందరు ‘భారత్‌లోని వేశ్యావాటికల్లో యువతులను ఉంచితే ఎవరికీ అనుమానం రాదు, పైగా తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించొచ్చు’అన్న దురాశతో ఇదే పనిని వృత్తిగా ఎంచుకున్నారు. 

బంగ్లాదేశ్‌లోని వీరి ఏజెంట్లు తమకు తెలిసిన మురికివాడల్లోని పేదలను సంప్రదిస్తారు. భారత్‌లో బాగా స్థితిమంతుల ఇళ్లు, హోటళ్లలో పనిచేసే అవకాశాలు ఉన్నాయంటూ అమ్మాయిలను పంపాలని కోరతారు. చిన్నపిల్లలైతే ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో 19 నుంచి 25 ఏళ్ల యువతులను ఎంపిక చేసుకుంటారు. పాస్‌పోర్ట్, వీసాలు లేకుండానే వీరిని అక్రమమార్గాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని వేశ్యా గృహాల్లో ఉంచుతారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వింగ్‌ బాటసింగారం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వారి చెరలో మగ్గుతున్న ఇద్దరు యువతులను రక్షించారు. ఈ రాకెట్‌ ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన లిటన్‌ సర్కార్‌ది బంగ్లాదేశ్‌. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు త్వరలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ కానుంది.

లాక్‌డౌన్‌ కాలంలో వ్యాపారం తగ్గిందని చాలామంది నిర్వాహకులు అక్రమమార్గంలో తీసుకొచ్చిన బంగ్లాదేశీ యువతులను తిరిగి స్వదేశానికి పంపించేస్తున్నారు. అయితే బీదరికంలో ఉన్న కొందరు మాత్రం ఇక్కడే ఉండి డేటింగ్‌ యాప్స్‌లో ఈ యువతుల చిత్రాలు ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. గూగుల్‌పే, ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు చేస్తే.. వారి వద్దకు యువతులను పంపడం లేదా విటులనే రప్పించుకోవడం పనిగా పెట్టుకున్నారు.