హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు రెండు కొత్త జిరాఫీలు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వీటిలో ఒకటి మగది, రెండోది ఆడది. మగ జిరాఫీ పేరు సన్నీ, ఆడ జిరాఫీ పేరు బబ్లీ.

వీటిని పశ్చిమబెంగాల్‌లోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్‌ నుచి తీసుకొచ్చారు. నిన్న రాత్రి రెండు జిరాఫీలు బెంగాల్ నుంచి క్షేమంగా హైదరాబాద్‌కు వచ్చినట్లు జూ అధికారులు తెలిపారు. ఎనిమల్ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్‌లో భాగంగా అలీపూర్ జూలాజికల్ పార్క్‌కి.... మూడు జతల మౌస్ డీర్స్, ఒక జత జాగ్వార్, ఒక జత ఆసియా జాతి సింహాన్ని అప్పగించారు.

వీటిని రోడ్డు మార్గంలో ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్‌లో తరలించినట్లు అధికారులు తెలిపారు. అలీపూర్ జూ నుంచి 4వ తేదీ బయలుదేరిన అధికారులు విశాఖ, ఏలూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేవరకు జిరాఫీలను సందర్శనకు అనుమతించమని... అందుకు నాలుగు వారాల సమయం పడుతుందని జూ అధికారులు తెలిపారు. 

"