తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బంద్ కి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌తోపాటూ... మరో 20కి పైగా డిమాండ్లతో సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు... ఇవాళ బంద్ తలపెట్టారు. దీంతో... తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు ప్రజలతోపాటూ... రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, సంస్థలు మద్దతు ఇచ్చాయి.

క్యాబ్ లు, ఆటోలు కూడా ఈ బంద్ కి మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇన్ని రోజులు బస్సులు లేకపోయినా క్యాబులు, ఆటోలతో ప్రజలు తమ ప్రయాణాలను కొనసాగించారు.నేడు అవి కూడా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో... మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

బంద్‌ నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్‌–అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ, ఎల్‌బీనగర్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌ మార్గాల్లో సుమారు 4లక్షల మంది మెట్రో సేవలు వినియోగించుకునే అవకాశముంది. అలాగే ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మార్గాల్లో 121ఎంఎటీఎస్‌ సర్వీసులు యథావిధిగానడుస్తాయి.

 1.5 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకోనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌–బొల్లారం మధ్య నడిచే డెమూ రైలునుశనివారం మేడ్చల్‌ వరకు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–కర్నూల్‌ సిటీ మధ్య మరో రెండు జన సాధారణ రైళ్లుఅదనంగా నడవనున్నాయి.

మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నప్పటికీ... ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పవని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి.. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పిల్లలకు స్కూల్ సెలవలు పెంచారనే కోపం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమౌతోంది. ఈ సమ్మె ఇలానే కొనసాగితే... ప్రజల్లో ఆగ్రహావేశాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.