కరోనా వైరస్ కేసు అనుమానితులు హైదరాబాద్ లో కూడా ఉండటం, గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్యా కూడా ఎక్కువవుతుండడంతో హైదరాబాద్ వాసులంతా కరోనా పేరు చెబితేనే వణికిపోతున్నారు. తాజాగా సికింద్రాబాద్ కు చెందిన ఒక టెక్కీకి కరోనా లక్షణాలను గుర్తించడంతో ప్రజలు అసలు బయటకు రావడానికే జంకుతున్నారు. 

ఇలా బయటకు రావడానికి ప్రజలు జంకుతూ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మెట్రోల్లోకాని బస్సుల్లో కానీ ఎక్కడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో ప్రయాణించడానికి బాగా భయపడుతున్నారు. 

ప్రజలు అలా భయపడడానికి కూడా కారణం లేకపోలేదు. మెట్రోలో అధికంగా ప్రయాణం చేసేది టెక్కీలే. వారు ఆన్ సైట్ పనుల మీద తరచుగా విదేశాలకు వేరే రాష్ట్రాలకు తిరుగుతుంటారు. కాబట్టి వారి ద్వారా కరోనా వైరస్ ఎక్కడ వ్యాపిసైతుందో అని అంతా భయపడిపోతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ లో కరోనా వచ్చిన వ్యక్తి కూడా టెక్కీయే కావడం వల్ల అందరూ భయాందోళనలకు గురవుతున్నారు. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో వర్గాలు అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టింది. మెట్రో రైళ్ళనన్నిటిని ఇప్పటికే క్లీన్ చేయడం, డిస్ ఇంఫెక్టన్ట్ లతో తుడుస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు చేతులు ఉంచే డోర్లు, పట్టుకొని నిలబడే హాంగార్లను ఇలా ప్రత్యేకంగా క్లీన్ చేస్తున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపాడు. 

మెట్రోలో ఎప్పటికప్పుడు అంనౌన్సుమెంట్ల ద్వారా ప్రయాణీకులకు కరోనా పై అవగాహన కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.