మరో రికార్డు సృష్టించిన హైదరబాద్ మెట్రో

మరో రికార్డు సృష్టించిన హైదరబాద్ మెట్రో

 హైదరాబాద్ మెట్రో రాకతో నగరం కొత్త సందడి నెలకొంది. నగరవాసులు మెట్రో ప్రయాణించడానికి కుటుంబాలతో  వస్తుండటంతో మెట్రో స్టేషన్లలో పండగ వాతావరణం నెలకొంది. ఇపుడు మెట్రో స్టేషన్లన్నీ నగరంలో కొత్త టూరిస్ట్ స్పాట్ లుగా మారినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ట్రాఫిక్ కష్టాలతో సతమతమైన నగరజీవి మెట్రోపై ఆసక్తి చూపిస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ విషయంలో హైదరాబాద్ మెట్రో మరో రికార్డును నెలకొల్పింది.

ఇప్పటికే రికార్డుల విషయంలో హైదరాబాద్ మెట్రో మోత మోగించిన విషయం తెలిసిందే. ప్రతిపాదనల దశ నుంచే మన మెట్రో రికార్డులను తిరగరాస్తూనే ఉంది. దేశంలోనే మొదటిసారిగా పిపిపి (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్) పద్దతితో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుగా ఇప్పటికే ఓ రికార్డును కైవసం చేసుకుంది. అలాగే మెట్రో పిల్లర్ల నిర్మాణాన్ని అత్యంత తక్కువ సమయంలో నిర్మించి దేశంలోని మరే మెట్రో సాధించని ఘనత సాధించింది.  ఇలా ప్రతి విషయంలోను రికార్డుల మోత మోగిస్తున్న మెట్రో ప్రారంభమైన తొలిరోజే మరో అరుదైన ఘనత సాధించింది.

దేశంలో ఇప్పటివరకు ప్రారంభమైన మెట్రోలతో పోల్చితే మొదటిరోజు అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణించిన రికార్డు హైదరాబాద్ మెట్రో పేరిట నమోదయ్యింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మొదటిరోజైన నిన్న(బుధవారం) దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలోని మరే మెట్రోలోను మొదటిరోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించిన దాఖలాలు లేవు.  ఎక్కడా కనీసం 50 వేల మంది ప్రయాణికులు కూడా దాటకపోవడం గమనార్హం. అయితే మన మెట్రో మాత్రం లక్ష మందిని దాటేసింది.

ఈ స్పందన చూస్తుంటే సెలవురోజుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. 

మెట్రో ప్రతిపాదనల దశ నుంచి ప్రారంభం వరకు నగరవాసుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. మెట్రో ప్రయాణంతో సమయం ఆదా అవడంతో పాటు హైదరాబాద్ అందాలను కొత్త తరహాలో ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. అందువల్లే మెట్రోలో  ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.   
 

 
  
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page