సమ్మె విరమించిన హైద్రాబాద్ మెట్రో కాంట్రాక్టు ఉద్యోగులు
హైద్రాబాద్ మెట్రోలో కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెను విరమించారు. రెండు రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రో కాంట్రాక్టు ఉద్యోగులు గురువారంనాడు సమ్మెను విరమించారు. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా హైద్రాబాద్ మెట్రో ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. వేతనాలు పెంచాలని మెట్రో రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో హైద్రాబాద్ మెట్రో రైల్వే యాజమాన్యం చర్చలు జరిపింది. వేతనాల పెంపు విషయంలో స్పష్టత రాలేదు. రెండు రోజులుగా ప్రత్యామ్నాయ సిబ్బందితో టికెటింగ్ కౌంటర్లను నడుపుతున్నారు. మెట్రో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా మెట్రో రైల్వే యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది.
ఈ నెల 3వ తేదీన ఉదయం నుండి టికెటింగ్ కౌంటర్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. నిన్న కూడా కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విధులకు దూరంగా ఉన్నారు. మెట్రో రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా యాజమాన్యం స్పష్టం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం కాంట్రాక్టు ఉద్యోగులకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపింది.చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. విధులనుండి తప్పిస్తామని మెట్రో యాజమాన్యం హెచ్చరించడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెను విరమించారు.గురువారంనాడు ఉదయం నుండి మెట్రో కాంట్రాక్టు ఉద్యోగులు విధులకు హాజరౌతున్నారు. ఎల్ బీ నగర్ మియాపూర్ రూట్ లోని 27 రైల్వే స్టేషన్లో టికెటింగ్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.