హైదరాబాద్: కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్  ఆంక్షల సడలింపులో భాగంగా  మెట్రో రైల్ నడిపేందుకు హెచ్ఎంఆర్ పూర్తిగా ఏర్పాట్లు చేసింది.మెట్రో రైలు ఎండీ ఎన్వీవీఎస్ రెడ్డి ఆదివారం నాడు ప్రయాణించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. 

సీటుకి సీటుకు మధ్య గ్యాప్ ఏర్పాటు చేశారు. రైళ్లలో నిల్చుని ప్రయాణం చేసే వారి మధ్య కూడ భౌతిక దూరం ఉండేలా  ఏర్పాట్లు చేశారు.ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్  చేసిన తర్వాతే రైల్వే స్టేషన్లోకి అనుమమతిస్తారు. 

మెట్రో రైల్లే స్టేషన్లలో టోకెన్ల జారీని రద్దు చేశారు. స్మార్ట్ కార్డు లేదా ఆన్ లైన్ లోనే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు. మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లను కూడ సమకూర్చారు. 

తాజా గాలి కోసం కొన్ని సమయాల్లో రైల్వే స్టేషన్ల వద్ద రైలు తలుపులను కొన్ని నిమిషాల పాటు ఓపెన్ చేసి ఉంచుతారు. గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్ గూడ రైల్వేస్టేషన్లు కంటైన్మెంట్ జోన్లలో ఉన్నందున వాటిని మూసి ఉంచనున్నారు.

మియాపూర్ నుండి ఎల్బీ నగర్ కు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపుతారు. ప్రయాణీకుల సంఖ్యను బట్టి రైళ్ల సంఖ్యను పెంచనున్నట్టుగా హెచ్ఎంఆర్ అధికారులు ప్రకటించారు.మినిమం లగేజీని మెట్రో రైళ్లలో తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. 

ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ప్రతి రోజూ 55 రైళ్ల ద్వారా 4.5 లక్షల మంది ప్రయాణీకులను ప్రతిరోజూ తరలించేవాళ్లు. కరోనా కారణంగా ఐదున్నర నెలల కాలంలో సుమారు రూ. 300 కోట్లను హైద్రాబాద్ మెట్రో రైలు నష్టపోయింది.