హైదరాబాద్: ఎమ్మార్వో బదిలీపై మాట్లాడేందుకు హైదరాబాదు మేయర్ గద్వాల విజయలక్ష్మి నిరాకరించారు. తాను ఇప్పడు ఏమీ మాట్లాడబోనని ఆమె అన్నారు. తాము పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో మునిగి ఉన్నామని చెప్పారు. మేయర్ గా గెలిచిన వెంటనే షేక్ పేట ఎమ్మార్వోను ఆమె బదిలీ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని ఆమె చెప్పారు.

కుల ధ్రువీకిరణ, ఆదాయ సర్టిఫికెట్ల విషయంలో తలెత్తిన వివాదంలో ఎమ్మార్వో శ్రీనివాస రెడ్డి విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆమె కార్పోరేటర్ గా ఉన్నారు. మేయర్ గా ఎన్నిక కాగానే ఆమె ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆయనను బదిలీ చేయించారని చెప్పారు. 

ఎమ్మార్వో శ్రీనివాస రెడ్డి బదిలీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా వివరణ ఇచ్చారు. తమకు అధికారులపై కోపం లేదని చెప్పారు. ప్రజా సమస్యలపై తాము ఎమ్మార్వోకు చెప్పామని, ఆయన పట్టించుకోలేదని దానం నాగేందర్ అన్నారు. అప్పుడు కార్పోరేటర్ గా ఉన్న విజయలక్ష్మి పట్ల శ్రీనివాస రెడ్డ దురుసుగా ప్రవర్తించారని ఆయన చెప్పారు. 

పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి హైదరాబాదు మేయరుగా ఎన్నికయ్యారు. ఆమె బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పోరేటరుగా ఎన్నికయ్యారు.