హైదరాబాద్: మేయర్ ఎన్నిక సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు బిజెపి కార్పోరేటర్లు ఇవాళ(బుధవారం) భేటీ అయ్యారు. కార్పోరేటర్లు చర్చించుకునేందుకు పార్టీ కార్యాలయంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటుచేసింది బీజెపి. రేపు(గురువారం) మేయర్ ఎన్నిక నేపథ్యంలో పాతబస్తీ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని జిహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు బీజెపి కార్పోరేటర్లు. 

గతంలోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన వెంటనే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నికల్లో బిజెపి తరపున విజయం సాధించిన కార్పోరేటర్లందరితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో కార్పోరేటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

read more   జీహెచ్ఎంసీ మేయర్ పదవి: పోటీలో టీఆర్ఎస్‌ నేతలు వీరే...

తాము ఎంఐఎం విముక్త హైదరాబాదు కోసం కృషి చేస్తామని సంజయ్ చెప్పారు. ఐదేళ్ల పాటు ఏ విధమైన ఒత్తిళ్లకు, ఇబ్బందులకు గురి కాకుండా తమ కార్పోరేటర్లు ప్రజా సేవ చేస్తారని ఆయన అన్నారు. హైదరాబాదు అభివృద్ధికి తమ కార్పోరేటర్లు సహకరిస్తారని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం తాము సహకరిస్తామని చెప్పారు.

తాము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. కేసీఆర్ సంకుచిత మైనారిటీ విధానాలను, మూర్ఖత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం ఎదుర్కుంటామని సంజయ్ చెప్పారు.