కత్తెరతో గొంతు కోసి ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. బుధవారం ఈ ఘటన చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జవహర్ నగర్ కి చెందిన శాంతి(28) కి విజయ్ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లి జరిగిన నాటి నుంచి భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సార్లు ఇరు కుటుంబాల పెద్దలు వారికి సర్థి చెప్పారు. కాగా... శాంతి చీరల వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించేంది. బుధవారం సాయంత్రం భార్య భర్త ల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది.

అది కాస్త తీవ్రవాగ్వాదానికి దారితీయగా.. కోపంతో ఊగిపోయిన విజయ్... కత్తెరతో భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న శాంతి భర్త విజయ్ కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా... భార్యను హత్య చేసిన అనంతరం విజయ్ తన కొడుకుతో కలిసి నంద్యాల వెళ్లినట్లు సమాచారం. అక్కడ చిన్నారి తన తండ్రి తల్లిని హత్య చేసినట్లు కుటుంబసభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.