హైదరాబాద్:హైద్రాబాద్ లోని  సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డువస్తోందని స్థానికులు ఓ భారీ వేపచెట్టును కొట్టేశారు. సుమారు నలభై ఏళ్ల వయస్సు ఉండే వేప చెట్టును రాత్రికి రాత్రి కొట్టేయటంతో పాటు ఆనవాళ్లు కనిపించకుండా కలపను తరలించారు. 

చెట్టు ఆనవాళ్లను తగులబెట్టే ప్రయత్నం కూడా చేశారు. తెల్లవారు జామున జరిగిన ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ (1800 425 5364) కు ఫోన్ చేశాడు. 

తాను గ్రీన్ బ్రిగేడియర్ ను అని పరిచయం చేసుకుని తమ ఇంటి సమీపంలో పెద్ద చెట్టును కొట్టేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరాడు. విచారణ చేపట్టిన అటవీ శాఖ ఈస్ట్ అధికారులు అనుమతి లేకుండా చెట్టు కొట్టివేతను నిర్థారించారు.  బాధ్యులైన వారికి రూ.62, 075 జరిమానా వేసి, వసూలు చేశారు. 

 బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదు చేసిన బాలుడిని అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. చెట్లు నరికివేస్తే  జరిమానా విధిస్తామని అటవీశాఖాధికారులు హెచ్చరించారు.