Russia War: ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి.. యుద్ధంలో మరణించిన హైదరాబాదీ
రష్యా ఆర్మీలో హెల్పర్లు ఉద్యోగాలు ఉన్నాయని ఓ ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి హైదరాబాద్ నుంచి ఓ యువకుడు మాస్కోకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. ఆర్మీలోకి బలవంతంగా చేర్చుకుని యుద్ధానికి పంపించారు. ఆ హైదరాబాద్ యువకుడు మరణించాడు.
హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల మొహమ్మద్ అస్ఫాన్ రష్యాలో మరణించాడు. ఆయన ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లాడు. రష్యా ఆర్మీకి సహకారులుగా పని చేయడానికి మనుషులు కావాలని దుబాయ్‌లోని ఏజెంట్ మోసం చేశాడు. ఆయన ఓ యూట్యూబ్ చానెల్ నడుపుతున్నాడు. అందులో తమకు రష్యా ఆర్మీతో సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు. రష్యా పాస్‌పోర్టులనూ చూపించాడు. అస్ఫాన్‌తో పాటు చాలా మంది ఆ ఏజెంట్‌ను నమ్మి.. రష్యా ఆర్మీలో హెల్పర్లుగా పని చేయడానికి సిద్ధమై వెళ్లిపోయారు.
అస్ఫాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. ఆయన ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లాడు. కానీ, అక్కడ ఆయనను బలవంతంగా రష్యా ఆర్మీలోకి పంపించారు. ఆ ఆర్మీలోనే ఫైట్ చేస్తూ మరణించాడు. తమ కొడుకును వెనక్కి రప్పించాలని అస్ఫాన్ కుటుంబం ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే వారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. ఆయన మాస్కోలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. అస్ఫాన్ గురించి ఆరా తీశారు. అస్ఫాన్ అప్పటికే మరణించాడని అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అస్ఫాన్ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
ఇండియన్ ఎంబసీ ఈ ఘటనపై స్పందిస్తూ.. అస్ఫాన్ మృతదేహాన్ని ఇండియాలోని ఆయన కుటుంబానికి అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది.