పెళ్లికి ఒక్కరోజు ముందు అదనపు కట్నం కావాలని.. లేకుంటే పెళ్లి ఆపేస్తామని డిమాండ్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. పేరుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.. రూ.5లక్షల కోసం కక్కుర్తి పడి పెళ్లిని ఆపేశాడు. ఇంకేముంది ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసి తమదైన శైలిలో బుద్ధి చెబుతున్నారు. ఈ సంఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మల్కాజిగిరి కి చెందిన నిఖిల్ కుమార్(32) ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతనికి హెచ్ డీఎఫ్ సీ లో ఉద్యోగం చేసే హరి ప్రియ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఇరుకుటుంబాల  సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేశారు. ఈ నెల 19వ తేదీన వీరి వివాహం నిశ్చయించారు. కట్నం కింద రూ.5లక్షల నగదు, 5తులాల బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. వాటిని పెళ్లికి ముందే ఇచ్చేశారు కూడా.

అయితే... పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సరిగ్గా ఒక్కరోజు ముందు అదనంగా రూ.5లక్షలు కావాలని నిఖిల్... హరిప్రియ కుటుంబసభ్యులను  డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పడంతో పెళ్లి రద్దు చేశారు. దీంతో... హరి ప్రియ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిఖిల్ ని అరెస్టు చేశారు.