హైదరాబాద్: తన పట్ల జవాన్  అసభ్యంగా ప్రవర్తించాడని లెఫ్టినెంట్  కల్నల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు మిలటరీ పోలీసులకు మూడు వారాల క్రితం ఫిర్యాదు చేసింది. కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్ పై చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు ఈ విషయమై రక్షణ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది.

బాధితురాలు హైద్రాబాద్‌లోని మిలటరీ క్వార్టర్స్‌లో చిన్నారితో కలిసి నివాసం ఉంటుంది. భర్త వేరే రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. బాధితురాలి నివాసం పక్కనే ఉన్న కల్నల్ నివాసంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్  గృహ సహాయకుడిగా  పనిచేస్తున్నాడు.

జవాన్‌కు ఇక్కడ పోస్టింగ్ లేదని రికార్డులు చెబుతున్నాయి. మరో వైపు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు బాధితురాలి భర్తను వేరే రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చినట్టుగా మరో ఫిర్యాదు ఇచ్చారు.

ఈ ఏడాది మే మాసంలో జవాన్ ఈ ప్రాంతంలో వచ్చినట్టు చెబుతున్నారు. అయితే బాధితురాలిపై రెండు వేర్వే సమయాల్లో జవాన్ ఆశ్లీలంగా కామెంట్స్ చేసినట్టుగా చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్ 23వ తేదీన జవాన్ తన టూ వీలర్ ను బాధితురాలి గ్యారేజీకి ఎదురుగా పార్క్ చేశాడు.  గ్యారేజీ నుండి కారు తీయకుండా ఈ టూ వీలర్ అడ్డుగా ఉందని ప్రశ్నించినందుకు దూషించినట్టుగా బాధితురాలు ఆరోపిస్తున్నారు.

తనను అమర్యాదగా జవాన్ సంబోధించినట్టుగా బాధితురాలు చెప్పారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న సిపాయి విషయం తెలుసుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై దాడి చేశాడని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయమై మిలటరీ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ కూడ రాలేదని ఆమె చెప్పారు. కానీ, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే ఇద్దరు పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చినట్టుగా బాధితురాలు చెప్పారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్ ను సివిల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సమయంలో  ఈ విషయాన్ని మిలటరీ పోలీసులు చూస్తారని చెప్పి సివిల్ పోలీసులను తిప్పి పంపినట్టుగా బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది.

మరోవైపు లెఫ్టినెంట్ కల్నల్ భార్య తనను బెదిరించిందని ఆమె చెప్పారు. తన భర్త ఉన్నతస్థాయికి ప్రమోట్ కాబోతున్నారు. నీవు కేవలం లెఫ్టినెంట్ కల్నల్ భార్యవు మాత్రమే అంటూ  తనను దూషించారని బాధితురాలు చెప్పారు. ఈ ఘటనలకు పోలీసులే సాక్ష్యంగా ఉన్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని  లెఫ్టినెంట్ ప్రతి రోజూ అసిస్టెంట్ కల్నల్ ను కోరేవాడని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 24 వతేదీన జవాన్ విదుల్లో తిరిగి చేరాడు. కల్నల్ భార్య తమ ఇంటి ఆవరణలోకి వచ్చి తన కొడుకును తిట్టిందని బాధితురాలు ఆరోపించారు.

కల్నల్ తన అధికారులను దుర్వినియోగం చేస్తున్నాడని బాధితురాలు  ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని  కోరుతూ ఆమె రక్షణ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని రక్షణశాఖ కార్యదర్శి కార్యాలయం బాధితురాలికి సలహా ఇచ్చింది.