హైదరాబాద్‌లో ఆకాశానికి చిల్లులు పడిందా అన్నట్లుగా కుంభవృష్టి కురుస్తోంది. అసలే చిన్న వర్షానికే చెరువులను తలపించే భాగ్యనగర రహదారులు.. ఈ భారీ వర్షానికి మహా సముద్రాలను తలపిస్తున్నాయి.

ఒక్కసారిగా జడివాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో ఎటుచూసినా వరదనీరే. మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది.

పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు లోతట్టు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట,పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, గౌలిపుర, చార్మినార్, ఫలక్‌నుమా, ఉప్పుగూడ ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

మ‌రో రెండు రోజుల పాటు వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. పిల్ల‌లు, వృద్ధులు బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని అధికారుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆదేశించారు. భారీ వర్షాలతో హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారింది.

ఏ క్షణంలోనైనా డ్యామ్ గేట్లు  ఎత్తేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్‌ సాగర్‌ 1762 అడుగులకు చేరింది. 1763 అడుగులు దాటితే గేట్లు ఎత్తేసామని హైదరాబాద్‌ మెట్రో పాలిటస్‌ వాటర్‌ సప్లై జనరల్‌ మేనేజర్‌ పేర్కొన్నారు.

తోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 2010లో చివరి సారి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు. మళ్లీ  పదేళ్ల  తర్వాత సాగర్  నిండింది. మరోవైపు డ్యామ్  గేట్ల దగ్గర లీకేజీ అవుతుండడంతో మరమ్మతులు చేస్తున్నారు సిబ్బంది.

ఇప్పటికే  లోతట్టు ప్రాంతాల ప్రజలను జలమండలి, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. మూసి నదీ పరివాహక ప్రాంతాలైన కిస్మత్ పూర్, బండ్లగూడ, హైదర్ గూడా, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు.

అటు భారీ వర్షాలతో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. 24 గంటలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని డీజీపీ ఆదేశించారు. డయల్‌ 100కు వచ్చే కాల్స్‌ అన్నింటీకి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైన డయల్‌ 100కు ఫొన్‌ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ కోరారు.