రాజ్ భవన్ ప్రాంగణంలో సోమవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సొందరరాజన్ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా ఆమె బతుకమ్మను పేర్చి.. ‘‘ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...’’ అంటూ పాట కూడా పాడటం విశేషం. అంతకు ముందు మహిళలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్యోగులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఇదిలా ఉండగా.. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా... ఆంధ్రప్రదేశ్ లో కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం గమనార్హం. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి తీరానబతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 40 మంది తెలంగాణ మహిళలు గోదావరి బండ్‌ రోడ్డులోని ఉమా మార్కండేయేశ్వర ఆలయం నుంచి పుష్కరాల రేవు వరకు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చారు.

కాగా... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకున్నారు. బతుకమ్మ పండుగ బానిసత్వానికి వ్యతిరేకంగా ఆరంభమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్‌ఎ్‌ఫఐడబ్లూ, శ్రామిక మహిళా ఫోరం ఆధ్వర్యంలో మక్దూం భవన్‌ లో సోమవారం సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కాసులాబాద్‌లో బహుజన బతుకమ్మ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్నారు.