హైదరాబాద్ ఆల్వాల్ లో ఓ స్కూల్ విద్యార్థిని మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. నిన్న మంగళవారం స్కూల్ కి వెళ్లిన చిన్నారి ఇంటికి రాకపోవడంతో అంతటా వెతికిన తల్లిదండ్రులు ఆచూకి దొరక్కపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్ సిసి టివి పుటేజిని పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయాలు బైటపడ్డాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... అల్వాల్‌ భూదేవినగర్‌కు చెందిన సంగీత అనే విద్యార్థిని నిన్న స్కూల్ కి వెళ్ళింది. అయితే సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్కూల్ లో ని సిసి టివి ఫుటేజి ని పరిశీలించారు. దీంట్లో ఉదయం స్కూల్ కి యూనిఫాం లో వచ్చిన సంగీత అక్కడ తన డ్రెస్ మార్చుకుని బైటికి వెళ్లడం కనిపించింది. 

అలాగే  ఇంటి నుండి సంగీత తన ఆధార్ కార్డును తీసుకుని వెళ్లిందని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో విద్యార్థి ముందుగానే పథకం ప్రకారం ఇలా చేసిందని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఈమె ఎందుకు ఇంటి నుండి వెళ్లిపోయిందో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే సంగీత తల్లిదండ్రులు మాత్రం రాకేష్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని అతడే మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటాడని పోలీసులకు పిర్యాధు చేశారు. దీంతో సంగీతతో పాటు రాకేష్ ను కూడా వెతకడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.