ఉన్నత చదువులకోసం లండన్ వెళ్లిన ఓ హైదరాబాద్ యువతి అక్కడ బీచ్ లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యింది. ఆమె మృతదేహాన్ని నగరానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఓ యువతి లండన్ లో హఠాన్మరణం విషాదాన్ని నింపింది. తన కోర్సులో ఫస్ట్ టర్మ్ అయిపోయిందని.. త్వరలోనే సెలవు తీసుకుని ఇంటికి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పిన ఆమె.. అంతలోనే కానరాని లోకాలకు పోయింది. లండన్ లో మృతి చెందిన ఆ యువతి పేరు సాయి తేజస్వీ కొమ్మారెడ్డి(24). యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకైక సంతానం. వీరు హైదరాబాదులోని ఐఎస్ సదన్ డివిజన్ లక్ష్మీ నగర్ కాలనీలో ఉంటున్నారు. 

సెలవులకు ఇంటికి వస్తానన్న కూతురు రాకపోగా.. అనంత లోకాలకు చేరుకోవడం.. ఆమె మృతదేహం కూడా నగరానికి రావడానికి సమయం పడుతుండడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. సాయి తేజస్వీ కొమ్మారెడ్డి సైదాబాదులో ఇంజనీరింగ్ సిఎస్ఈ పూర్తి చేసింది. మాస్టర్స్ కోసం లండన్ లోని క్రాస్ ఫీల్డ్ యూనివర్సిటీకి నిరుడు సెప్టెంబర్ లో వెళ్లింది. ఏప్రిల్ 11వ తేదీన అక్కడ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు బ్రైటన్ బీచ్ కు వెళ్లింది. అక్కడ బీచ్లో సరదాగా గడుపుతున్న సమయంలో సముద్రంలో కొట్టుకుపోయింది.

విచిత్రం.. కుక్కలే వారి ఆస్తులు.. ఆడపిల్లపెళ్లిలో వరకట్నంగా శునకాలు.. ఎక్కడంటే..

అది గమనించిన ఆమెతో పాటు ఉన్న సహవిద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు సమాచారం అందించారు. వెంటనే బలగాలు రంగంలోకి దిగి తేజస్వి గురించి సముద్రంలో గాలించాయి. ఆమెను గుర్తించి బయటికి తీశాయి. కానీ అప్పటికే ఆమెలో చలనం లేదు. దగ్గర్లోని ససెక్స్ కౌంటీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. 

లండన్ నుంచి తేజస్వి మృతదేహాన్ని స్వస్థలమైన హైదరాబాదుకు తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు సహాయం చేయాల్సిందిగా కేటీఆర్ కు తేజస్వి బంధువులు ట్రీట్ చేశారు. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మృతురాలు ఇంటికి వెళ్ళారు. ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడించారు. కాగా శుక్రవారం నాటికి తేజస్వి మృతదేహం హైదరాబాద్కు చేరుకుంటుందని వారికి సమాచారం అందింది.

తేజస్వీ చనిపోవడానికి ముందు రోజు వీడియో కాల్ లో తల్లిదండ్రులతో మాట్లాడండి. తన కోర్సు ఫస్ట్ టర్మ్ పూర్తయిందని చెప్పింది. కూతురు వెళ్లి చాలా రోజులవడంతో కుదిరితే వారం పది రోజులు సెలవు తీసుకుని రమ్మని వారు కోరారు. ఇక ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ సెర్మనీ కూడా ఉంది. దీంతో తల్లిదండ్రులు లండన్ కు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతలోనే ఇలా జరిగిందని తేజస్వి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.