విచిత్రం.. కుక్కలే వారి ఆస్తులు.. ఆడపిల్లపెళ్లిలో వరకట్నంగా శునకాలు.. ఎక్కడంటే..
కుక్కలను ఆస్తులుగా భావించే కొన్ని కుటుంబాలు.. వరకట్నంగా కూడా వాటినే ఇచ్చే వింత ఆచారం కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది.

సిరిసిల్ల : పెంపుడు శునకాలను ప్రేమగా చూసుకోవడం.. ఇంట్లో ఒక సభ్యుడిగా ఆప్యాయతను కురిపించడం.. వాటికి పుట్టినరోజులు, పెళ్లిళ్లు చేసి సంబరపడడం చూస్తుంటాం. ఇవి శునకాల మీద వాటి యజమానులకు ఉండే ప్రేమను, ఇష్టాన్ని తెలుపుతాయి. కుక్కలను పెంచుకోవడం కొందరికి అభిరుచి, మరికొందరికి మరికొందరికి అవసరం. ఇంటి రక్షణ కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం పెంచుకుంటుంటారు.
అయితే, ఆస్తులను కాపాడడానికి కాకుండా కుక్కలనే ఆస్తులుగా భావించే కుటుంబాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఆడపిల్లకు పెళ్లి చేసిన సమయంలో కట్నంగా కుక్కలను ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఉండే కొన్ని కుటుంబాల్లో ఇది ఆచారంగా ఉంది. వారెవరు? వారి జీవన శైలి ఏమిటో చూద్దాం..
సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిరెద్దుల ఆట పాటలతో గ్రామాలు మురిసిపోతాయి. ఇక వీటిని ఆడించే గంగిరెద్దుల వారు…రకరకాలుగా అలంకరించి, ఇళ్ళ ముందుకు తీసుకువచ్చి.. వాటితో అనేక రకాల విన్యాసాలు చేసి పొట్ట పోసుకుంటున్నారు. ఇలా సిరిసిల్ల జిల్లాలోని మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి.
కోనరావుపేట మండలం కొండాపూర్, బావు సాయి పేట, చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామాల్లో దాదాపు 100 గంగిరెద్దుల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ మూడూర్లకు చెందిన గంగిరెద్దుల కుటుంబాల వారు.. జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు. వారు సేకరించిన ఆహారంతో కుక్కలను కూడా పోషిస్తారు. వేటకు, వారి గుడారాలకు రక్షణగా ఈ కుక్కలను వాడతారు.
అలా ఒక్కో కుటుంబం ఐదు నుంచి పది, పదిహేను, ఇరవై కుక్కలను పెంచుతుంది. వీరి కుటుంబాలలో తరతరాలుగా కుక్కలను ఆస్తులుగా భావించే ఆచారం కొనసాగుతోంది. ఎవరి దగ్గర ఎక్కువ శునకాలు ఉంటే వారు అంతా ఆస్తిపరులు అన్నట్టు. వారి దగ్గర ఉన్న శునకాల సంఖ్యను బట్టి గంగిరెద్దుల కుటుంబాల్లో వారికి గౌరవం పెరుగుతుంది.
ఇక మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆడపిల్లలకు పెళ్లిలలో కట్నంగా ఈ శునకాలను ఇచ్చే సంప్రదాయం ఈ కుటుంబాల్లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంప్రదాయం మెల్లగా మారుతోంది. గంగిరెద్దులను ఆడించడం భిక్షాటన చేయడం మానేసి కొంతమంది వ్యవసాయం చేస్తూ, మరికొందరు ప్లాస్టిక్ సామాగ్రిని బుట్టల్లో అమ్ముతూ, కొబ్బర్లకు బదులు చక్కర ఇస్తూ జీవిస్తున్నారు.
దీని గురించి సంచార జీవి అయిన టేకుమల్ల రాజయ్య మాట్లాడుతూ.. కుక్కలను పెంచడం మాకు తరతరాలుగా అనవాయతీగా. ఒకప్పుడు ఇంటి ముందు ఎన్ని కుక్కలు ఎక్కువగా ఉంటే అంత విలువ ఉండేది. రాను రాను ఇది తగ్గిపోతుంది. ఇప్పుడు అంతగా లేదు. కాలం మారింది కానీ, కానీ మాకు కుక్కలు ఉండాల్సిందే. మేం తినేదే వాటికి పెడతాం.. మేము ఎక్కడికి వెళితే వాటిని అక్కడికి తీసుకెళ్తాం.. అన్నారు.
ఇక బావుసాయిపేట గ్రామానికి చెందిన గంట లచ్చయ్య మాట్లాడుతూ.. ఇదివరకు కుక్కలను ఎక్కువగా పెంచే వాళ్ళం.. షికారి చేసే వాళ్ళం.. కానీ ఇప్పుడు మా వాళ్ళు దాన్నుంచి పక్కకు తప్పుకున్నారు. సోకులు ఎక్కువైనాయి. వ్యవసాయం, కూడకలకు చక్కర అమ్ముడు చేస్తున్నారు. బిచ్చమెత్తుతలేరు.. కూడా మాకు కుక్కలతోనే ధనం అని చెప్పుకొచ్చారు.