హైదరాబాద్: గతంలో టీఆర్ఎస్, బిజెపిల్లో చేరిన కాంగ్రెసు నేతలు పలువురు వెనక్కి చూస్తున్నట్లు తెలుస్తోంది. తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో తిరిగి తమ సొంత గూటికి చేరుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. డీకే అరుణతో పలువురు గతంలో కాంగ్రెసు పార్టీని వీడి టీఆర్ఎస్, బిజెపిల్లో చేరిన విషయం తెలిసిందే. 

లోకసభ ఎన్నికలకు ముందు డికె అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు మరికొంత మంది బిజెపిలో చేరారు. డీకె అరుణ మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

ఎన్నికల్లో ఓడిపోతే నామినేటెడ్ పోస్టు ఇస్తామని డీకే అరుణకు బిజెపి నేతలు హామీ ఇచ్చారు. అయితే, ఆమెకు ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకోలేదని అంటున్నారు. తనకు ఏదైనా పదవి వస్తుందనే ఆశ కూడా డీకే అరుణకు లేకుండా పోయిందని చెబుతున్నారు. 

లోకసభ ఎన్నికల సమయంలో సురేష్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. వారికి టీఆర్ఎస్ లో ఏ విధమైన ప్రాధాన్యం లభించడం లేదు. నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలు కావడంతో సురేష్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం ఏ విధమైన పదవి కూడా ఇవ్వకపోవచ్చునని అంటున్నిారు. ఐదేళ్ల క్రితం టీఆర్ఎస్ లో చేరిన బి. సారయ్యను టీఆర్ఎస్ నాయకత్వం గుర్తించిన పాపాన కూడా లేదు. 

టీఆర్ఎస్, బిజెపిల్లో తాము ఉండలేని పరిస్థితి నెలకొందని ఆ నాయకులు అంటున్నట్లు తెలుస్తోంది. తాము చేరిన పార్టీల్లో తమ అభిప్రాయాలకు కూడా విలువ లేకుండా పోయిందని, పార్టీల్లో స్వేచ్ఛగా మసలలేని పరిస్థితి కూడా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్, బిజెపిలతో పోలిస్తే కాంగ్రెసు పార్టీలో వాతావరణం బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరంలోనైనా తమకు తగిన ప్రాధాన్యం లభించకపోతే తిరిగి కాంగ్రెసులోకి రావాలని వారు అనుకుంటున్నట్లు సమాచారం.