Ragging Incident : గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. పదిమంది సీనియర్లపై వేటు..
Ragging Incident : హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేగింది. జూనియర్ పై సీనియర్ మెడికోలు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. దీంతో సీనియర్లపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది.

Ragging Incident : తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ చదువులకు దూరమై.. తమ బంగారు భవిష్యత్తును కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. వాస్తవానికి అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భూతాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి విక్రుత చర్యలు చట్టరిత్యా నేరమని, అలాంటి చర్యలకు చట్టరిత్యా కఠిన శిక్షలు పడతాయని తెలిసినా.. కొంతమంది ఆకతాయి విద్యార్థులు మాత్రం తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పరిచయం లేదా ఇంటరాక్షన్ పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో గాంధీ మెడికల్ కాలేజీలో వెలుగులోకి వచ్చింది. గాంధీ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై కొంతమంది సీనియర్లు హద్దుల మీరి దారుణానికి పాల్పడ్డారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ బాధిత విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీరియస్ గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం... ఆ పది మంది సీనియర్ విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఏ విద్యాసంస్థల్లోనైనా విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అలాంటి చర్యలను ర్యాగింగ్‌ను సహించేది లేదని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఏ వైద్య కళాశాలలోనైనా విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.అయితే.. ఇటీవలే వరంగల్ మెడికల్ కాలేజీ కి చెందిన ప్రీతీ అనే మెడికో.. సీనియర్ వేధింపుల వల్లే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాలు కోల్పోయింది. కాగా.. అప్పటి నుంచి పలువురు మెడికోలు ఆత్మహత్యలకు పాల్పడినా.. వాటికి కారణం ర్యాగింగ్ అని తేలలేదు. అయితే.. ఇలాంటి సమయంలో కూడా ర్యాగింగ్‌కు పాల్పడటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.