హైదరాబాద్‌లోని బోయిగూడలో ఈ తెల్లవారుజామను స్క్రాప్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగి.. 11 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో కొందరు సజీవదహనం కాగా, మరికొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న కేసీఆర్.. ఉన్నతాధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతులు మొత్తం బిహార్‌కు చెందిన కార్మికులు కావడంతో.. వారి మృతదేహాలను బిహార్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ సర్కార్ విచారణకు ఆదేశించింది.
బోయిగూడలో ఈ తెల్లవారుజామను స్క్రాప్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగి.. 11 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో కొందరు సజీవదహనం కాగా, మరికొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసకుంది. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో మృతదేహాల వెలికితీత ఇబ్బందికరంగా మారింది.
ఘటన స్థలం నుంచి మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్టుగా అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. మృతులను బిహార్‌కు చెందిన సికిందర్ (40), బిట్టు (23), సత్యేందర్ (35), గోలు (28), దామోదర్ (27), రాజేశ్ (25), దినేశ్ (35), రాజేశ్ (25), చింటు (27), దీపక్ (26), పంకజ్ (26)గా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన ప్రేమ్ అనే వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. సమాచారం అందిన వెంటనే అధికార వర్గాలు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, అయినప్పటికీ కార్మికులను కాపాడలేకపోయారని అన్నారు. ఈ ఘటన చాలా బాధకరమని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చునని అధికారులు చెప్పారని ఆయన అన్నారు. విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ ఘటన చాలా విషాదకరమైనదన్నారు. స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయని చెప్పారు. మంటలు చెలరేగి సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. కార్మికులంతా నిద్రలో ఉన్న సమయంలో అగ్రి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కార్మికులు నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఇలాంటి గోదాములు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయని చెప్పారు. గోదాంలో ఎలాంటి రక్షణ చర్యలు, ఫైర్ సెఫ్టీ పరికరాలు లేవన్నారు. గోడౌన్ యజమానిని అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరిగి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ దిగ్బ్రాంతి..
బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సానుభూతి తెలియజేశారు.
