Hyderabad: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ - టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తాజా వార్తా కథనాలు సంచలనంగా మారాయి. ఈటల మళ్లీ టీఆర్ఎస్ గూటికి రావడానికి ఆ పార్టీ అన్ని అంశాలను పరిశీలిస్తున్నదని ‘డీసీ‘ ఒక కథనంలో పేర్కొంది.
KCR - Eatala Rajendar: ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీని టార్గెట్ చేసినట్టు సమాచారం. దీని కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీకి చెందిన పలువురు నాయకులను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నదనీ, దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీని కోసం బీజేపీ భవిష్యత్తు లేదని, దానితో చేరిన ఇతర పార్టీల నాయకులు ఎక్కువ కాలం ఉండలేరనే అంశాన్ని హైలెట్ చేస్తూ.. తన ఎన్నికల వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మాజీ నాయకుడు, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్ లోకి వచ్చే అంశాలను ప్రస్తావిస్తూ డీసీ ఒక కథనం ప్రచురించింది. ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
డీసీ తన కథనం ప్రకారం.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నట్లు సమాచారమంటూ పేర్కొంది. టీఆర్ఎస్, బీజేపీలోని సంబంధిత వర్గాలను డీసీ ఉటంకిస్తూ.. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ లోకి రావడానికి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని నివేదించింది. మునుగోడు ఎన్నికల తర్వాత బీజేపీకి చెక్ పెట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించేందుకు ఆయన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని పేర్కొంది. రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ పుంజుకోకుండా చూస్తుంది.
బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఏం చెబుతున్నారంటే..?
ఆఫర్లు వస్తున్నాయని తమకు తెలుసునని, కానీ రాజేందర్ ఎందుకు వెనక్కి వెళ్తారో తాము ఆలోచించలేమని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఆయన తిరిగి వస్తే అతని కీర్తి ఏమి మిగిలి ఉంటుంది? నేడు ఆయన కేసీఆర్, టీఆర్ఎస్ లతో పోరాడుతున్నదే చూస్తున్నాని అన్నారు. మునుగోడులో జరిగిన పోరాటం తర్వాత టీఆర్ఎస్ నైరాశ్యాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మరో బీజేపీ నేత వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ తమ నేతల్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసిందనీ, కానీ బీజేపీ నేతలు మాత్రం రాజకీయ, ఇతరత్రా ప్రలోభాలకు లొంగరని అన్నారు. దీనిపై స్పందించిన ఒక టీఆర్ఎస్ నాయకుడు.. ఆరోపణలను ఖండించారు. "ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మేము అలాంటి రీచ్-అవుట్ చేయలేదు.. బీజేపీకి నాయకుల కొరత ఉంది.. టీఆర్ఎస్ కు కాదు" అని వ్యాఖ్యానించారని డీసీ నివేదించింది.
బీజేపీ నాయకులు ఈ వాదనను ఖండించనప్పటికీ, పార్టీ చేస్తున్న ఆఫర్ల గురించి తమకు తెలుసునని పేర్కొంటున్నారు. అయితే ఈటల రాజేందర్ మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి రారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా గులాబీ పార్టీ ఇలాంటి ఆఫర్లను ఇచ్చిందని మరో కాషాయ పార్టీ నేత పేర్కొన్నారని డీసీ నివేదించింది. కాగా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న వాదనలను తోసిపుచ్చిన ఈటల రాజేందర్, బీజేపీలో తన ఎదుగుదలను ఆపేందుకు టీఆర్‌ఎస్ తనపై ఈ దుష్ప్రచారాన్ని చేస్తోందని చెప్పినట్టు డీసీ కథనం పేర్కొంది.
