Ganesh Immersion| ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సర్వం సిద్దం.. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభం..
Ganesh Immersion| హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు భారీ ఎత్తున ఏర్పాటు పూర్తి చేశారు. నవరాత్రులు మండపాల్లో ఘనమైన పూజలందుకొని గణనాయకులు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సమయం ఆసన్నమైంది

Ganesh Immersion| గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ నగరం సర్వం సిద్ధమైంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన వేడుకకు ప్రత్యేకం ఏర్పాటు చేశారు. గత రాత్రి నుంచి ఖైరతాబాద్ మహాగణేషుడిని నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రాత్రే తుది పూజ నిర్వహించారు. ఇప్పటికే మహాగణపతి విగ్రహాన్ని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ వర్క్ పూర్తి చేశారు. ఈ గణనాయకుడి శోభాయాత్ర ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కానున్నది.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడిని తొలుత నెక్లెస్ రోడ్డుకు తరలిస్తారు. అంటే.. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహాగణపతి విగ్రహం ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ పై ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 వద్దకు మహాగణపతి చేరుకుంటారు. అక్కడే చివరి పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ గణనాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 40వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బంది సిద్దంగా ఉన్నారు. దాదాపు 48 గంటల పాటు సాగే ఊరేగింపును 20 వేలకు పైగా సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ఈ రోజు (గురువారం) ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.