నొప్పిగా వుందని ఆసుపత్రికి వెళితే.. కిడ్నీలో 206 రాళ్లు, గంటలోనే తీసేసిన వైద్యులు

హైదరాబాద్‌లో ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఓ వ్యక్తి కిడ్నీలో ఏర్పడిన దాదాపు 206 రాళ్లను గంటలోపే తొలగించారు ఎల్‌బీ నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు. రోగి కోలుకోవడంతో అతనిని రెండ్రోజుల్లోనే డిశ్చార్జ్ చేశారు. 
 

hyderabad Doctors remove 206 kidney stones in 1 hour

సాధారణంగా కిడ్నీలో (kidney stones) ఒకటి లేదా రెండు రాళ్లు వుంటేనే ఆ మనిషి బాధ వర్ణనాతీతం. అలాంటిది ఏకంగా 200కు పైగా రాళ్లు వుంటే అతని పరిస్ధతి ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే కిడ్నీలోని దాదాపు 206 రాళ్లను వెలికితీసి హైదరాబాద్‌లోని అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు (Aware Gleneagles Global Hospital ) అరుదైన ఘనత సాధించారు. గురువారం సదరు ఆస్పత్రి వైద్యులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య (56) (Veeramalla Ramalakshmaiah) గత ఆరు నెలలుగా కిడ్నీలో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయన గత నెల హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని అవేర్‌ ఆస్పత్రిలో చేరాడు. 

అతన్ని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూల నవీన్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. ఈ పరీక్షల్లో రామలక్ష్మయ్య ఎడమ వైపు కిడ్నీలో చాలా రాళ్లు ఉన్నట్లు తేలింది. అనంతరం సీటీ క‌బ్ స్కాన్ చేసి దీన్ని మ‌రోసారి ధ్రువీక‌రించుకొన్నారు. అనంతరం శస్త్రచికిత్స చేసి రాళ్లను తొలగించాలని నిర్ణయించారు. దీనికి రామలక్ష్మయ్య అంగీకరించారు. 

దీనిలో భాగంగా రామలక్ష్మయ్యకు కీ హోల్‌ శస్త్ర చికిత్స చేసి గంట వ్యవధిలోనే కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించారు. అనంతరం రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్య అధికంగా ఉంటుందని, ఎండలో అధికంగా తిరగడం కారణంగా రాళ్లు ఏర్పడతాయన్నారు. నీరు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలని వైద్యులు ప్రజలకు సూచించారు. నీటి శాతం తక్కువ అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని డాక్టర్లు పేర్కొన్నారు. ఎండలో అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని.. శీతల పానీయాల జోలికి పొవద్దని సూచించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios