Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. విచారణ సిట్‌కు బదిలీ , సీవీ ఆనంద్ ఆదేశాలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. 

hyderabad cp cv anand transfer tspsc paper leak case investigation to sit
Author
First Published Mar 14, 2023, 6:42 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

మరోవైపు.. పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు ప్రవీణ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చే చాలామందితో ప్రవీణ్ సంబంధాలు పెట్టుకున్నాడు. అతని సెల్‌లో పలువురు మహిళల కాంటాక్ట్స్ వున్నట్లుగా పోలీసులు తెలిపారు. కాన్ఫిడెన్షియల్ గదికి సెక్రటరీ వెళ్లినప్పుడు.. ఐపీ, యూజర్ ఐడీ దొంగిలించాడు ప్రవీణ్. అనంతరం ఏఈ ప్రశ్నాప్రత్రాన్ని రాజశేఖర్‌తో కలిసి పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీని గురించి రేణుక దంపతులతో చర్చించిన ప్రవీణ్ ఒక్కో అభ్యర్ధి నుంచి రూ.20 లక్షల వసూలు చేయాలని.. అందులో రూ.10 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

అనంతరం ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ తీసి రేణుక దంపతులకు ఇచ్చాడు. దీంతో వారు వాళ్ల కమ్యూనిటీలో పేపర్ వుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్ధులు నీలేష్,గోపాల్‌లు ప్రశ్నాపత్రం కొనేందుకు ముందుకు వచ్చారు. పరీక్షకు మూడు రోజుల ముందు వీరిద్దరిని తన ఇంట్లోనే వుంచి ప్రిపేర్ చేయించారు. అలాగే పరీక్షా పత్రం లీకేజ్ గురించి బయటకు తెలియకుండా రేణుక దంపతులు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్ధులను కారులో సరూర్ నగర్‌లోని సెంటర్‌లో వదిలిపెట్టారు రేణుక దంపతులు. పోలీసులు విచారణలో నిందితులంతా తమ నేరాన్ని అంగీకరించారు. మరోవైపు.. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించిన నిందితులకు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, ఏ3 నిందితురాలు రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios