హైదరాబాద్: కన్నతల్లిని కష్టపెట్టిన కొడుకుకు కోర్టు జైలు శిక్ష విధించింది. తండ్రి చనిపోతే తల్లిని ఆదరించకపోగా ఇంటి కోసం బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో మల్కాజిగిరి న్యాయస్థానం నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షను విధించింది.

హైద్రాబాద్ నేరేడ్‌మెట్ లోని కాకతీయనగర్ కాలనీకి చెందిన ప్రేమ కుమారి కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. వీరందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. 2013 లో ప్రేమ కుమారి భర్త చనిపోయాడు. ప్రేమ కుమారి పెద్ద కొడుకు ఎం. అమిత్ కుమార్  కు కన్నతల్లి ఇంటిపై కన్ను పడింది. ఈ ఇంటిని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేశాడు. 

2015 ఫిబ్రవరిలో ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఆ ఇంటిని తమ పేరిట రెగ్యులరైజ్ చేయించుకొన్నాడు.ప్రేమ కుమారిని మానసికంగా వేధించాడు. 

2015 అక్టోబర్ 13న ప్రేమ కుమారి ఇంటి నుండి బయటకు వచ్చేసరికి ఇంటికి తాళం వేసి కొడుకు కోడలు వెళ్లిపోయారు. లోపలికి వస్తే అంతు చూస్తామని బెదిరించారు.దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన మల్కాజిగిరి న్యాయస్థానం ప్రేమకుమారి కొడుకు అమిత్, కోడలు లావణ్యలను దోషులుగా తేల్చింది.వీరిద్దరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు రూ.10 వేల చొప్పున జరిమానాను కూడ వేసింది.