ఉదయపూర్ ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. చార్మినార్, పాతబస్తీల్లో భద్రతను పెంచారు భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. 

హైదరాబాద్ : బిజెపి బహిష్కృత నేత నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయపూర్ లో టైలర్ ను చంపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయపూర్ లో జరిగిన ఘటనపై హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్, పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేశారు.

కాగా, నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇద్దరు దుండగులు టైలర్ దుకాణంలోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొలతలు తీసుకుంటున్న టైలర్ ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తర్వాత ఉదయపూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. టైలర్ హత్య తర్వాత పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్టు చేశారు. ఇద్దరు హంతకులు ఈ మర్డర్ తర్వాత వీడియో కూడా రిలీజ్ చేశారు. బట్టలు కుట్టించుకుంటామనే నెపంతో హంతకులు అతని దుకాణానికి వచ్చి హత్య చేశారు. 

Udaipur Murder Case : రాడికలైజేషన్ ను నియంత్రించాలి.. హింస ఎలాంటిదైనా ఖండించాలి.. అసదుద్దీన్ ఓవైసీ..

అంతే కాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి.. వైరల్ చేశారు. ఇలా చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత రాజస్థాన్ లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఉదయపూర్లో షాపులన్నింటినీ మూసివేశారు. దుర్ఘటనతో ఉదయ్పూర్ ఒక్కసారిగా భగ్గుమంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక బీజేపీ డిమాండ్ చేసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగారు. నిందితులకు శిక్ష పడుతుందని ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. దయచేసి ఎవరూ ఉద్రిక్త పూరితమైన వ్యవహారాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు. 

ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తాలిబన్ తరహాలో ఇద్దరు వ్యక్తులు దర్జీ గొంతు కోసి చంపిన ఘటన తరువాత.. దేశంలో చెలరేగుతున్న హింసను ఖండించాలని, "రాడికలైజేషన్‌ను నియంత్రించాలని" AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు."నేను ఇక్కడ సుఖంగా కూర్చుని ఉదయపూర్‌లో ఆ పేద టైలర్‌కి ఏం జరిగిందో దాన్ని నేను ఖండించలేను, కానీ అదే సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్‌ లేదా జైపూర్‌లో జరిగిన ప్రతీ హింసాత్మక చర్యను ఖండించాలి. రాడికలైజేషన్‌ను నియంత్రించాలి. అందుకే నేను మన దేశంలో జరుగుతున్న రాడికలైజేషన్‌ను పర్యవేక్షించడానికి MHAలోని యాంటీ-రాడికలైజేషన్ సెల్ ఒక నిర్దిష్ట మతానికి మాత్రమే కాకుండా ప్రతి మతానికి ఉండాలని డిమాండ్ చేస్తున్నాను”అన్నారాయన.

ఇవేవీ లేకుండా దీన్ని నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే.. ఈ వ్యక్తులు చేసింది దారుణమైన నేరం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి అనాగరికమైన పనికిమాలిన పని చేసే హక్కు ఎవరికీ లేదు’’ అని ఒవైసీ అన్నారు. ఉదయపూర్‌లో రద్దీగా ఉండే మార్కెట్‌లో కన్హయ్య లాల్ తన దుకాణంలో ఉండగా మధ్యాహ్నం పూట ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించారు. క్షణాల్లో అతడి మీద కత్తితో దాడి చేశారు. దీన్నంతా వీడియో తీశారు. హంతకులు దర్జీని ఎలా హత్య చేశారో చెబుతూ.. సంతోషపడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఆ తరువాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.