హైదరాబాద్ బ్రాయిలర్, నాటు కోళ్లలో మనుషుల్లో క్యాన్సర్ కలిగించే బ్యాక్టీరియం కనిపించింది
హైదరాబాద్ చికెన్ తింటున్నారా, అయితే, ఇది చదవండి.
మనుషుల్లో జీర్ణాశ యానికి సంబంధించిన అనేక రోగాలను కల్గించడమే కాకుండా, క్యాన్సర్ కు దారి తీసే బాక్టీరియంని హైదరాబాద్ లో దొరుకుతున్న బ్రాయిలర్, నాటు కోళ్ల నుంచి శాస్త్రవేత్త లు వెలికితీశారు.
ఇలాంటి ప్రమాదకరమయిన రోగకారకాన్ని మనం తెగతినేస్తున్న చికెన్ లో కనుగొనడం ఇదే మొదటి సారి. ఈ బ్యాక్టీరియం పేరు హెలికోబాక్టర్ పుల్లోరం. ఇది బ్రాయిలర్ , నాటు కోళ్ల లివర్ , పేగులలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియం ఉన్న చికెన్ లాగించేస్తే మనుషుల్లో కడుపు సంబంధ జబ్బులొస్తాయి. ఈ విషయాన్ని కొనగొన్నదెవరో కాదు,హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తలే . హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న బ్రాయిలర్, నాటు కోళ్ల మీద చేసిన పరిశోధనా ఫలితాలను అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ వారు అచ్చేసే ఎప్లయిడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్ (నవంబర్ 4 సంచిక) లో ప్రచురించారు. హెచ్. ఫుల్లోరం బ్యాక్టీరియం మీద వచ్చిన తొలి అధ్యయనం ఇది.
ఈ పరిశోధనా బందానికి చెందిన నియాజ్ అహ్మద్ ( సీనియర్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయోరియల్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్. ఢాకా) చెపిందాని ప్రకారం హెచ్ .పుల్లోరానికి క్యాన్సర్ కల్గించే సామర్థ్యం ఉంది. కోళ్లకు జబ్బుల రాకుండా వాడే మందులతో పాటు దాణాలో వాడే రసాయనాల వల్ల ఈ బ్యాక్టీరియం బాగా బలిసి ఔషధ నిరోధక శక్తి సమకూర్చుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
’ ఈ బ్యాక్టీరియం సైటో లీథల్ డిస్టెండింగ్ టాక్సిన్ తయారుచేస్తుంది. అదే ఆందోళన కల్తించే విషయం. ఇది మనుషుల్లోని డిఎన్ఎ ను దెబ్బ తీస్తుంది. దేహ కణాల పరితీరు మీద దుష్ప్ర భావం చూపిస్తుంది. ఈ బ్యాక్టీరియం కాలేయంలో ప్రవేశిస్తుంది కాబట్టి కాలేయ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంది,’ అని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.
కొసమెరుపు
అపుడే భయపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ స్టయిల్ ఆఫ్ చికెన్ కుకింగ్ మీకు రక్ష. మామాలుగా మన ఇళ్లలో చికెన్ ని బాగా అంటే 60 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే ఉడికిస్తాం కాబట్టి హెచ్.పుల్లోరం కసపిస అయిపోతున్నది. అయితే, వుడికించని చికెన్ తింటే ప్రమాదం. అంటే, సరిగ్గా ఉడక్కపోయినా, లేదా చికెన్ పికిల్ తిన్నా పుల్లోరం బ్యాక్టీరియం కసుక్కున కాటేస్తుంది. చికెన్ ఎలా తింటా రో నిర్ణయించుకోండి. ప్రస్తుతానికింతే జాగ్రత. ఇది భవిషత్తు విపత్తు అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
