హైదరాబాద్ లో గురువారం కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసును చేదించడంలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ చైన్ స్నాచింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న నగర పోలీసులు 24 గంటల్లోపే స్నాచర్లు వాడి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని భవాని నగర్ సమీపంలో ఓ ముళ్ల పొదల్లో ఈ మోటార్ సైకిల్ ను గుర్తించారు. దీని ఆధారంగా దుండగులను గుర్తించి, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 

ఈ  బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు పోలీసులు. అయితే ఆ బైక్ ని తాను రెండేళ్ళ క్రితమే ఇతరులకు అమ్మేసినట్లు తెలిపాడు. దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తుల గురించిన వివరాలను అతడి నుండి సేకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ పని నగరానికి చెందిన ముఠానే చేసి వుంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. 

నగరంలో నిన్న ఒక్క రోజే 11 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ స్నాచింగ్ లకు పాల్పడింది ఒకే ముఠా అని తెలుసుకున్న పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా బైక్ లభించింది. దీని ఆధారంగా నిందితులేవరో తెలుసుకోడానికి హైదరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.