టివి రిపోర్టర్ నాగరాజుపై పోలీసుల దాడి పోలీసు దెబ్బలకు తట్టుకోలేక మూర్చపోయిన నాగరాజు తాను జర్నలిస్టునని చెప్పినా వినకుండా కొట్టిన పోలీసులు జర్నలిస్టు సంఘాల ఆందోళన

ఛానెల్ విలేకరిపై పోలీసులు జరిపిన దాడి ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ నగరంలో మహాన్యూస్ టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్న నాగరాజు పై పోలీసులు దాడిచేసి కొట్టారు. బాధితుడు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి. జర్నలిస్టు నాగరాజు తన మిత్రుడి తండ్రి మరణిస్తే పరామర్శించడానికి చుడిబజార్ నుండి దిల్ సుఖ్ నగర్ వెళ్లడానికి రోడ్డుమీద నిలబడ్డాడు, అదే సమయంలో ఆ పక్కన కొందరు మద్యం తాగి గొడవ చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు అక్కడ చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన సదరు వ్యక్తులు అక్కడి నుండి తప్పించుకున్నారు. ఆ సమయంలో అక్కడే నిల్చున్న రిపోర్టర్ నాగరాజును ఎవరు నువ్వు అని అడిగితే నేను టీవి రిపోర్టర్ అని చెప్పిండు. కానీ అతడిని పోలీసులు షాయినాత్ గంజ్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. అక్కడికి వెళ్లాక కూడా నేను మహా న్యూస్ టీవీ ఛానేల్ రిపోర్టర్ ని అని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. ఆయన చెప్పే మాటలు వినకుండా అతడిని లాఠీ తో చితకబాదారు. ఆ దెబ్బలు తట్టుకోలేక నాగరాజు అక్కడిక్కడే సృహా కోల్పోయాడు. దీంతో పోలీసులు రిపోర్టర్ నాగరాజును తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి చేరుకున్న మీడియా పోలీసులను ప్రశ్నించగా ఆ గొడవకి కారణంగా భావించి ఇలా జరిగింది అని వివరణ ఇచ్చారు. కానీ రిపోర్టర్ నాగరాజు నేను రిపోర్టర్‌నని, ఆ గొడవకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా పోలీసులు పట్టించుకోకుండా కొట్టారని తెలిపారు. ఈ విషయం పైన జర్నలిస్టు సంఘాలు రిపోర్టర్ నాగరాజుకు మద్దతుగా నిలిచాయి. జర్నలిస్టు మీద దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. హైదరాబాద్ లో జర్నలిస్టుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. సర్కారు స్పందించే వరకు ఆందోళన చేపడతామని జర్నలిస్టు నేతలు అంటున్నారు.
