అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్ బిర్యానీ...!!
ఓ అంతరాష్ట్ర దొంగ హైదరాబాద్ బిర్యానీ కోసం ఆశపడి దొరికిపోయాడు. కర్ణాటక నుంచి వచ్చి హైదరాబాద్ లో దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఆ దొంగ.. తన బిర్యానీ ప్రేమను వదులుకోలేక.. పట్టుబడ్డాడు.
హైదరాబాద్ : Hyderabad Biryani అంటే ఇష్టపడని Non Veg Lovers ఉండరు. ప్రపంపవ్యాప్తంగా హైదరాబాద్ కు వచ్చే పర్యాటకులు దీని రుచి చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఇక హైదరాబాదీలైతే వారానికి కనీసం ఒకసారైనా రుచి చూడనిదే వదిలిపెట్టరు. అయితే దీని ఘనతల గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నా.. ఇప్పుడు మరొక క్రెడిట్ దీని ఖాతాలో పడింది. అదేంటంటే.. హైదరాబాద్ బిర్యానీ thiefల్ని కూడా పట్టిస్తుంది. నిజమా..? అని అవాక్కయ్యారా? నిజమేనండీ.. అలాంటి ఘటనే ఇటీవల చోటు చేసుకుంది. ఓ అంతర్రాష్ట్ర దొంగను ఈ హైదరాబాద్ బిర్యానీ పట్టించింది.
ఎలాగంటే.... కర్ణాటకలోని మైసూర్ హాలో కేసరేలో సయ్యద్ బజాబ్ ఎలియాస్ ఇమ్రాన్ నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ వచ్చి నగరంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, తాళం పగుల గొట్టి విలువైన నగలు, నగదును దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నాడు. అయితే దోచుకున్న నగలు, నగదుతో తిరిగి వెళ్లే సమయంలో అతనికి ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీని ఆరగించడం అలవాటు. పలు సందర్బాల్లో మలక్ పేట సోహైల్ హోటల్ నుంచి జొమాటో ద్వారా Mehdipatnamలోని ప్రైవేటు ట్రావెల్స్ బిర్యానీ తెప్పించుకుని, ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు.
అలా చేస్తూ కొంతకాలం గడిపిన ఇమ్రాన్ ఒకరోజు మలక్ పేట పరిధిలోని వెంకటాద్రినగర్ కాలనీలో ఇంటికి తాళం వేసి ఉండటంతో చోరీకి పాల్పడ్డాడు. ఆ తరువాత మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్ కు బిర్యానీ తెప్పించుకుని ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, దొంగతనం జరిగిన ఇంటి బాధితుడు సయ్యద్ ఇస్తేకారుద్దీన్ మే 14న చోరీ జరిగిన సంఘటనను మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంటి సమీపంలో నమోదైన మొబైల్ కాల్ డేటాను సేకరించారు. వీటి లావాదేవీలు మొబైల్ నంబర్ ద్వారా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.
కాల్ డేటా ఆధారంగా మలక్ పేట్ క్రైం ఇన్స్ పెక్టర్ నానునాయక్ తో కూడిన క్రైం పోలీసు బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్ బజాజ్ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50 లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా పోలీసులు గుర్తించారు.