హుజూర్ నగర్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో తెరాస పార్టీలో కొత్త కలవరం మొదలయ్యింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల తెరాస కు పడవలిసిన దాదాపు 7వేల ఓట్లు ట్రక్కు గుర్తుకు పోలయ్యాయి. అలా గందరగోళం వల్ల తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓటమి చెందారు. అసలు ట్రక్కు గుర్తు వల్లే ఈ ఉపఎన్నిక వచ్చిందని తెరాస ఆరోపిస్తోంది. 

ఈ ఉపఎన్నికలో తెరాస కు రోడ్డు రోలరు రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. వంగపల్లి కిరణ్ కుమార్ అనే వ్యక్తికి ఎన్నికల సంఘం రోడ్డు రోలరు గుర్తును కేటాయించింది. ఇతను రిపబ్లికన్ సేన అనే పార్టీనుండి బరిలోకి దిగారు. 

కాంగ్రెస్ పార్టీయే ఇలాంటి చౌకబారు రాజకీయాలకు దిగి ఇలా కారు గుర్తును పోలి ఉన్న గుర్తుల కోసం దరఖాస్తు చేపిస్తుందని ఆరోపిస్తుంది. కేవలం రోడ్డు రోలరు గుర్తు మాత్రమే కాకుండా ట్రాక్టర్ నడిపే రైతు గుర్తు కూడా ఇలాంటి పనికిమాలిన రాజకీయాలవల్లే వచ్చిందని ఆరోపిస్తోంది. 

ఏషియానెట్ న్యూస్ వంగపల్లి కిరణ్ ను ఈ విషయమై సంప్రదించింది. తనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అతను తెలిపాడు. అంబేడ్కర్  మనవడు ఆనంద్ రాజ్ అంబేడ్కర్ నెలకొల్పిన రిపబ్లికన్ సేన పార్టీ తరుఫున పోటీలో దిగానని తెలిపాడు.ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడినని వంగపల్లి కిరణ్ స్పష్టం చేసారు. 

ఎన్నికల్లో పోటీ చేయడం ఇదేం తొలిసారి కాదని, గతంలో సూర్యాపేట శాసనసభకు, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి కూడా పోటీ చేసానని తెలిపాడు. 

రోడ్డు రోలరు లేదా ట్రక్కు గుర్తును కావాలని ఎందుకు అఫిడవిట్ లో కోరారు అని ప్రశ్నించగా, గతంలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీచేసినప్పుడు కూడా రోడ్డు రోలరు గుర్తు మీదే పోటీ చేసానని, ఇందులో వేరే ఉద్దేశం ఏమి లేదని తెలిపాడు. 

దళితవాదన్ని వినిపించడానికే పోటీలో ఉన్నాను తప్ప అధికార దాహం కోసం మాత్రం కాదని తెలిపారు. అధికార తెరాస చెబుతున్నట్టు తనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు.