హుజూర్ నగర్:   హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయవాతావరణం మంచి కాక మీదుంది. అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్ర అగ్ర రాజకీయనేతలంతా హుజూర్ నగర్ లో తిష్ఠ  వేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేసేందుకు ఎత్తులు వాటికి పైఎత్తులు వేయడంలో తలమునకలైయున్నారు. 

కాంగ్రెస్ ఎలాగైనా తన సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని పట్టుదలగా ఉంటే, ఎలాగైనా కాంగ్రెస్ ని వారి సొంత సీట్లోనే ఓడించి విమర్శకుల నోర్లు మూయించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. మరోపక్క తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని నిరూపించుకోవడానికి ఇక్కడ ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. 

గులాబీ బాస్ కెసిఆర్ ఈ సీటును ఖచ్చితంగా గెలవాలిసిందే అని కేటీర్ ను ఆదేశించినట్టు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన కేటీర్ హుజూర్ నగర్ లోనే పాగా వేసాడు. మొత్తం గులాబీ నేతలంతా ఇక్కడే మొహరించారు. కాంగ్రెస్ ను ఎలాగైనా ఓడించాలని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. 

తెరాస కు ఎలాగైనా చెక్ పెట్టాలని కెసిఆర్ వ్యతిరేకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎన్నికల బరిలో చాలామందితోని కావాలని నామినేషన్ వేయించినట్టు సదరు అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. 

హుజుర్ నగర్  ఉప ఎన్నికలో మొత్తం 119 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 64 రిజెక్ట్ అవ్వగా కేవలం 55మాత్రమే స్క్రూటినీ తరువాత అర్హత సాధించాయి. ఇందులో అభ్యర్థుల అఫిడవిట్లలో ఒక విషయం ఆశ్చర్యపరుస్తుంది. 

అర్హత సాధించిన అఫిడవిట్లను పరిశీలిస్తే ఒక విషయం మనకు అవగతమవుతుంది. చాలామంది అభ్యర్థులు గుర్తు ప్రాధాన్యత చోట ట్రక్కు, రోడ్డు రోలరు,ఆటో, ట్రాక్టర్ నడిపే రైతు గుర్తులను కోరారు. కేవలం ఏదో ఒకటో రెండో కాదు, చాల అఫిడవిట్లలో ఇలానే ఉంది. 

ఎన్నికలబరిలో ఇండిపెండెంట్ గా నిలిచినా తీన్ మార్ మల్లన్న కూడా ఈ మూడు గుర్తులనే కోరడం విశేషం. ఈ గుర్తులన్నీ తెరాస కారు గుర్తుకు దగ్గరగ్గా ఉండేవే. గత ఎన్నికల్లో ఇదే హుజూర్ నగర్ స్థానంలో ట్రక్కు గుర్తువల్ల తెరాస కు పోల్ అవ్వాల్సిన దాదాపు 7వేల ఓట్లు ట్రక్కు గుర్తుకి పడ్డాయి. వీటివల్ల తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి పెద్ద దెబ్బే పడింది. 

ఈసారి వంగపల్లి కిరణ్ అనే వ్యక్తికి రోడ్డు రోలరు గుర్తు, అజ్మీరా మహేష్ అనే వ్యక్తికి ట్రాక్టర్ నడిపే రైతు గుర్తు కేటాయించబడ్డాయి. ఇంకో గమనించాల్సిన అంశం ఏమిటంటే, వీరిరువురి గుర్తులూ కారు గుర్తు కింద నేరుగా ఉన్నాయి. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి సీరియల్ నెంబర్ 4 కాగా, 5వ సీరియల్ నంబర్లో ట్రాక్టర్ నడిపే రైతు, 6వ సీరియల్ నంబర్లో రోడ్డు రోలరు ఉన్నాయి. ఓటర్లలో గందరగోళం మాత్రం ఖాయం. 

ఈ సారి తెరాస ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు వేసిన ప్లాన్స్ వర్కవుట్ అవుతాయో లేదో చూడాలంటే అక్టోబర్ 24వ తేదీ వరకు ఆగాల్సిందే.