హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలను చేస్తోంది. తమకు మద్దతివ్వాలని టీఆర్ఎస్ యేతర పార్టీల మద్దతు కోరుతోంది.
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు శుక్రవారం నాడు సమావేశమయ్యారు.హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వీహెచ్ కోరారు.
ఈ నెల 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలు పార్టీల మద్దతును కోరుతోంది. టీజేఎస్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతును ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో జనసేన మద్దతును కూడ కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మద్దతు విషయమై చర్చించారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన, కాంగ్రెస్ తో పాటు విపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. ఈ మేరకు గత మాసంలో జనసేన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వి.హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై కాంగ్రెస్, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులను కూడగట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను చేస్తోంది. ఇందులో భాగంగానే జనసేన మద్దతును కాంగ్రెస్ కోరింది. అయితే పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
రెండు తెలుగురాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని టీడీపీతో పాటు ఇతర పార్టీలు కోరాయి. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఎన్నికల్లో తటస్థంగా నిలిచారు.
2009 నుండి ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ స్థానంనుండి విజయం సాధించడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు వచ్చాయి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరలోకి దిగింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి, టీడీపీ అభ్యర్ధిగా చావా కిరణ్మయి, బీజేపీ అభ్యర్ధిగా కోట రామారావులు బరిలో ఉన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 4, 2019, 1:08 PM IST