హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభకు ఎన్ని క కావడంతో ఆయన హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఆ సీటు ఖాళీ అయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 

శానససభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. హుజూర్ నగర్ సీటును తన వశం చేసుకునేందుకు బిజెపి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు నుంచి కాంగ్రెసు నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. 

హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ మూడుసార్లు విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడిన నేపథ్యంలో దాన్ని అవకాశంగా తీసుకోవాలని బిజెపి భావిస్తోంది. టీఆర్ఎస్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఈ సీటు నుంచి బరిలోకి దింపాలని భావించింది. అయితే, ఆయన అందుకు ఇష్టపడలేదు. 

ప్రస్తుతం ఎన్నారై శానంపూడి సైదిరెడ్డినే టీఆర్ఎస్ పోటీకి దించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, స్థానికత దృష్ట్యా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడానికి చేసిన తెగువ దృష్ట్యా సైదిరెడ్డినే తిరిగి బరిలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత ఇదివరకే సైదిరెడ్డికి పచ్చజెండా ఊపినట్లు కూడా చెబుతున్నారు. 

కాగా, సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని పోటీ చేయాల్సిందిగా కాంగ్రెెసు నాయకత్వం కోరింది. అయితే, ఆయన అందుకు ఇష్టంగా లేరు. తానేమైనా ముఖ్యమంత్రిని అయ్యేది ఉందా అంటూ ప్రశ్నించి, తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని పోటీకి దించుతారని భావిస్తున్నారు. ఆమె కోదాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లేదంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గూడూరు నారాయణ రెడ్డిని పోటీకి దించవచ్చునని సమాచారం.