బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మోకాలికి అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలిసిన మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈటల రాజేందర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, బిజెపీ నేత ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో ప్రజా దీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల ఆస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గత కొద్ది రోజులుగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన మోకాలికి ఆర్థోస్కోపి శస్త్రచికిత్స చేశారు సోమవారం నాడు ఆయనకు ఆ సర్జరీ చేశారు. ఈటల రాజేందర్ కోలుకుంటున్టన్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటల రాజేందర్ మీద టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయాలు అయినట్లు, అనారోగ్యానికి గురైనట్లు, ఒళ్లంతా పట్టీలు కట్టుకుని తిరుగుతూ సానుభూతి పొందడం బిజెపి ఎత్తుగడ అని హరీష్ రావు అన్నారు. వీల్ చైర్ లో కూర్చుని హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ప్రచారానికి వస్తారని ఆయన అన్నారు.
సిద్ధిపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం టీఆర్ఎస్ ప్రజా ప్రితనిధులను, నేతలను, ఇంచార్జీలను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ లో గెలిచినా ప్రజలకు నయా పైసా లాభం కూడా ఉండదని ఆయన అన్నారు బిజెపి ఆడే నాటకాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈటల రాజేందర్ అప్పట్లో ఓ వ్యక్తిలా టీఆర్ఎస్ లోకి వచ్చారని, ఇప్పుడు ఓ వ్యక్తిలానే టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు. ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ లో అత్యంత ప్రాధాన్యం లభించిందని, అయితే ఈటల రాజేందర్ తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారని ఆయన అన్నారు.
