హుజూరాబాద్ వేడి: ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్?
హుజూరాబాద్ శానససభ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ మీద పోటీ చేసే తమ టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థి పేరును ఈ నెల 16న కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారు.
హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీద టీఆర్ఎస్ తరఫున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీకి దిగే అవకాశం ఉంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఖాయం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులకు సమాచారం అందించారని అంటున్నారు.
టీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డిని పోటీకి దించాలని కేసీఆర్ తొలుత భావించారు. 2018 సాధారణ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఈటల రాజేందర్ మీద 60 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆడియో లీక్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెసు నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. కౌశిక్ రెడ్డిని పోటీకి దించకపోవడం వెనక పలు కారణాలున్నాయని అంటున్నారు.
కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు ప్రాజెక్టును ఈ నెల 16వ తేదీన ప్రారంభించారు. హుజూరాబాద్ లోనే ఆయన ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఆ సమయంలో గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో బలమైన నాయకుడే. అయితే కాంగ్రెసు నుంచి ఇటీవలే టీఆర్ఎస్ లోకి వచ్చారు. పైగా మానుకోట రాళ్ల దాడిలో కౌశిక్ రెడ్డి పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి. ఆ విషయం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దాంతో బలమైన నాయకుడైన ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడానికి ఆ అంశాలు కౌశిక్ రెడ్డి విషయంలో వ్యతిరేకంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి విషయంలో కేసీఆర్ మనసు మార్చుకుని బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస యాదవ్ ను పోటీకి దించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పొనుగంటి మల్లయ్య, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ పేర్లను కూడా కేసీఆర్ పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే, చివరకి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
దాంతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంచార్జీ అయిన మంత్రి హరీష్ రావు సోమవారం సిద్ధిపేటలో నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశానికి గెల్లు శ్రీనివాస యాదవ్ హాజరయ్యారని అంటున్నారు. వకుళాభరణం కృష్ణమోహన్ కు నామినేటెడ్ పోస్టు ఇస్తారని భావిస్తున్నారు.