Huzurabad Bypoll: తమ్ముడూ అంటూనే... తడిగుడ్డతో నా భర్త గొంతు కోసారు కేసీఆర్: ఈటల జమున (వీడియో)
హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆమె విరుచుకుపడ్డారు.
కరీంనగర్: తన భర్త ఈటల రాజేందర్ (Eatala Rajender) ను కేసీఆర్ తమ్ముడు తమ్ముడు అంటూనే తడిగుడ్డతో గొంతు కోశారని ఈటల జమున (eatala jamuna) మండిపడ్డారు. రాజేందర్ రాజీనామా వల్లే హుజూరాబాద్ (Huzurabad Bypoll) కి ప్రతీ పథకం వస్తోందని... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కాబట్టి ప్రజలు ఈటల రాజేందర్ కు ఓటేసి గెలిపించాలని జమున కోరారు.
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, ఓయూ జేఏసి నేత సురేష్ యాదవ్, సంపత్ తో కలిసి ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న జమునపై పువ్వుల వర్షం కురిపిస్తూ... బతుకమ్మలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. తమ ఇంటి ఆడబిడ్డలా భావించి బొట్టుపెట్టి మంగళహారతులతో ఆశీర్వదించారు.
బిజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తన భర్త ఈటల రాజేందర్ ను గెలిపించాలని జమున కోరగా సంపూర్ణ మద్దతు తెలిపారు గ్రామస్తులు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులని... డబ్బులకు అమ్ముడు పోయేవారు కాదనడానికి ఇదే నిదర్శనమన్నారు. దళితులు కూడా రూ.10 లక్షలు కాదు ఉద్యోగం కావాలని అడుగుతున్నారని... ట్రాక్టర్లు, కార్లు ఇస్తే డిగ్రీలు, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు డ్రైవర్లుగా పనిచెయ్యాలా అని అడుగుతున్నారు ఈటల జమున అన్నారు.
వీడియో
ఈటల జమున వెంట ప్రచారంలో పాల్గొన్న ఓయూ జేఏసి నేత సురేష్ యాదవ్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ నేతలు తాలిబన్లలాగా హుజురాబాద్ ప్రజల మీద పడుతున్నారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులమంతా ఈటల రాజేందర్ గెలుపు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మీ కాళ్లు మొక్కి అడుగుతున్నా ఈటలను గెలిపించండి అని వేడుకున్నారు.
''నేను ఈ నియోజకవర్గంలో నేను ఎందుకు పుట్టలేదు అని బాధపడుతున్నాను. ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ ను కేసిఆర్ గెలిపించుకోలేరు. కేసిఆర్ ను ఓడించకపోతే తెలంగాణ సర్వనాశనం అవుతుంది. రాజేందర్ అన్న గెలవకపోతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే రోజు వస్తుంది. మేము బ్రతకాలంటే రాజేందర్ అన్నకి ఓటు వెయ్యాలి. ఉద్యోగాలు ఇవ్వమంటే గొర్రెలు, చేపలు, బర్లు ఇస్తున్నారు'' అంటూ సురేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.