Asianet News TeluguAsianet News Telugu

క్యారెక్టర్ లెస్ సీఎం కేసీఆర్... ఇండియా టుడే సర్వేలో తేలిందిదే: ఈటల సంచలనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యారెక్టర్ ను కోల్పోయారంటూ మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

huzurabad bypoll... eatala rajender sensational comments on cm kcr
Author
Huzurabad, First Published Aug 19, 2021, 1:10 PM IST

కరీంనగర్: అన్నిటి కంటే మనిషికి క్యారెక్టర్ అవసరం... అటువంటి క్యారెక్టర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ లాస్ అయ్యాడని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఅర్ నోట ఏ మాట వచ్చినా రాష్ట్ర ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మీటింగ్ లో స్వయంగా కేసీఅర్ మాట్లాడుతుంటే మహిళలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారని... ఆయన చెప్పే మాటలు అమలు కావని మహిళలు మాట్లాడుకునే ముచ్చట్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయంటూ ఈటల ఎద్దేవా చేశారు. 

''ప్రజా ప్రతినిదిగా పని చేసే వాళ్ళు ఎవరయినా తమ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపిలు చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోడు. గతంలో పనిచేసిన ముఖ్యంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించేది... కానీ కేసీఆర్ ప్రజలు సమస్యలు చెప్పకునే వీలులేకుండా ప్రజాదర్బార్ రద్దు చేశారు'' అని అన్నారు. 

''తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రతిష్ట, గౌరవం అధ:పాతాళానికి పోయిందని ఇండియా టుడే సర్వేలో తేలింది. హుజూరాబాద్ లో సొంత పార్టీ నాయకులను కొన్న ఘనత సిఎం కేసీఅర్ దే. ఎన్నికల నోటిఫికేషన్ భయంతోనే వాసాలమర్రిలో ప్రారంభించిన దళితబంధును చివరకు హుజూరాబాద్ లోనూ ప్రారంభించారు'' అని ఈటల తెలిపారు. 

''తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అప్పులకు వడ్డీలు కలిపితే లక్ష కోట్ల పైనే అవుతుంది. మరో 35 వేలకోట్ల వరకు సంక్షేమ పథకాలకు పోతాయి. ఇక దళిత బంధుకు ఎక్కడినుండి నిధులు కేటాయిస్తారు. తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంతో శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని ఈటల డిమాండ్ చేశారు. 

read more  నా వల్లే దళిత బంధు... దళితులేం గొర్లు కాదు: దళిత సంఘాల సన్మాన సభలో ఈటల

''38 సంత్సరాలుగా గుర్తుకురాని దళితుల మీద ప్రేమ ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చింది? ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు వచ్చాయి... దళితులకు ఎన్ని మంత్రి పదవులు వచ్చాయో ప్రజలకు తెలుసు. దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? సీఎంఓ కార్యాలయంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అధికారి అయినా ఉన్నారా?'' అని ఈటల నిలదీశారు.

''నేను ఓపెన్ డిబేట్ కు సిద్ధం.... సంవత్సరానికి కనీసం పది వేల కోట్లయినా దళితులకు కేటాయించే సత్తా ఉందా? అలా చేసినా దళితులందరికీ దళిత బంధు రావాలంటే 17సంవత్సరాలు పడుతుంది'' అన్నారు. 

''హైదరాబాద్ లో భూమి అమ్మితే వచ్చిన డబ్బులు హుజూరాబాద్ లో తెచ్చి పెడుతున్నారు. దళితులకు ఇస్తా అంటున్న పది లక్షల మీద కలెక్టర్, బ్యాంకర్ల అజమాయిషీ లేకుండా ఇవ్వాలి. దళిత బందు లాగే అన్ని కులాల్లో ఉన్నపేద వర్గాలకు పది లక్షలు ఇవ్వాలి. మనసుంటే మార్గం ఉంటది అంటారు కదా... మరి మిగతా వర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదు... ఇవ్వాలన్న మనసు లేదా మార్గం లేదా?'' అని నిలదీశారు, 

''సీఎం కేసీఅర్ మోసపు మాటలు నమ్మొద్దు. హుజూరాబాద్ దళితుల కోసం సభ పెడితే హుజూరాబాద్ దళితులు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైన దళిత బంధు సభలో ప్రోటోకాల్ పాటించకుండా వేరే వాళ్ళను స్టేజ్ మీద కూర్చోబెట్టారు. చిల్లర ప్రయత్నాలు చేసి అభాసుపాలు కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు వస్తే టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని ఛాలెంజ్ చేస్తున్నా'' అన్నారు ఈటల రాజేందర్.  

 

Follow Us:
Download App:
  • android
  • ios