నా వల్లే దళిత బంధు... దళితులేం గొర్లు కాదు: దళిత సంఘాల సన్మాన సభలో ఈటల

హుజురాబాద్ ప్రజలకు దళిత బంధు పథకం రావడానికి కారణం తానేనని దళిత సమాజం గుర్తించిందని... ఇందుకు మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

dalit bandhu credit goes to me... eatala rajender

కరీంనగర్: పోరాడే వారు ఉంటారు, పోరాడితే ఫలితాలు ఇచ్చే వారు ఉంటారు... కానీ పోరాడిన వారినే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తన రాజీనామే సీఎం కేసీఆర్ దళిత సాధికారత, దళిత బంధు గుర్తుచేశాయని అన్నారు. దళిత సమాజం అన్నింటినీ గమనిస్తోందని...వారు అమాయకులే కావొచ్చు కానీ గొర్లు కాదని ఈటల అన్నారు.  

హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత బందు రావడానికి కారణం ఈటల రాజేందర్ అంటూ జమ్మికుంట పట్టణంలో దళిత సంఘాల సమైక్య వేదిక ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... నాయకులకు అవసరాలు ఉంటాయి కానీ ఏదయినా ముఖం మీదే చెప్పే సత్తా సామాన్య జనానికి మాత్రమే ఉంటుందన్నారు. 

''రాజేందర్ లెఫ్ట్, రైట్, సెంటర్ అన్న అందరూ పోయారు... మళ్ళీ సామాన్య జనమే మిగిలారు. సమాజ బాగే ప్రజల ఎజెండా ఉంటుంది. పాలకులు ఎప్పుడు ప్రజలమీద ప్రేమతో కాదు, పవర్ కోసం జరిగే సంఘర్షణలో తాయిలాలు ఇస్తుంటారు'' అన్నారు. 

''ఈటెల రాజేందర్ ను ప్రాణం వుండగానే బొంద పెట్టాలని ఈ దళిత బంధు స్కీం తెచ్చారు. కేసిఆర్ 38 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చివరకు సీఎంగా వివిధ హోదాల్లో ఉన్నారు. ఇన్నాళ్ళుగా దళితులు ఎందుకు గుర్తు రాలేదు. దళితుడే సీఎం అన్నాడు... మాట తప్పితే తల నరుక్కుంటా అన్నారు. మరి మాట తప్పిండా? నిలబెట్టుకున్నడా? మీరే ఆలోచించుకోవాలి'' అన్నారు. 

read more  సీఎం కేసీఆర్ తెలంగాణ తాలిబాన్: దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు

''అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయవద్దు. ఖజానాలో డబ్బులు ఉంటే ఎందుకు ఇవ్వడం లేదు. దళిత బంధును ఎవ్వరూ ఆపరు... మీరే కేసులు వేసి ఆపుతారేమో?'' అని ఈటల అనుమానం వ్యక్తం చేశారు. 

''నిజాం కంటే కర్కోటకమైన ప్రభుత్వం కేసిఆర్ ది అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్ర  చరిత్రలో చీకటి అధ్యాయం నడుస్తుంది. పోలీసులు, నాయకులు ఆలోచించండి... రేపు మీ మీద కూడా ఇదే ప్రయోగించవచ్చు. ఈ నికృష్ట పాలనలో మీరు కూడా కొట్టుకుపోతారు'' అని హెచ్చరించారు. 

''హుజూరాబాద్ గడ్డ చైతన్యవంతమైనది. కాబట్టే కేసిఆర్ కుట్రలను తట్టుకోగలగుతుంది. దళిత బంధు స్కీంకి కారణం నేనే అంటూ మీరందరూ గుర్తించినందుకు అందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. అఫర్లకు పోకుండా ఆత్మగౌరవం కోసం కొట్లాడిన బిడ్డను నేను. గతంలో వైఎస్ రాజశఖరరెడ్డి ఎంత ఒత్తిడి చేసినా పోలేదు. తెలంగాణ ఉద్యమం వల్లనే నేను ఎమ్మెల్యే అయ్యా అని అప్పుడే చెప్పిన. ఇప్పుడు అదే చెబుతున్నా'' అన్నారు. 

''కేసిఆర్ నీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. ఎక్కడినుండి ఇన్ని డబ్బులు తెచ్చి నాయకులను కొంటున్నావు. సామాన్యుడు , డబ్బు లేనివాడు ఎమ్మెల్యేనో, ప్రజా ప్రతినిధి అయ్యే పరిస్థితి లేదు'' అని ఈటల అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios