Asianet News TeluguAsianet News Telugu

జాతీయ జెండా సాక్షిగా.. భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త..

కుటుంబకలహాల నేపథ్యంలో జెండావందనం రోజునే ఓ భర్త భార్యను అతి దారుణంగా.. నడి బజారులో గొంతుకోసం హత్య చేశాడు. అదీ జెండా ముందే..ఈ ఘటన కరీంనగర్ లో కలకలం రేపింది. 

husband murdered wife over family disputes in karimnagar
Author
Hyderabad, First Published Aug 16, 2022, 7:20 AM IST

కరీంనగర్ : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించారో, ఒప్పించారో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ముద్దులొలికే చిన్నారులూ ఉన్నారు. కానీ కాలం గడిచేకొద్దీ వారి మధ్య ప్రేమ ఆవిరైపోయి, ద్వేషం రగిలింది. ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేంతగా ప్రేమించుకున్నవారే... ప్రాణాలు తీసుకునేలా తయారయ్యారు. కరీంనగర్ లో ఇలాంటి దారుణ ఘటనే స్వాతంత్ర్య దినోత్సవ వేళ విషాదాన్ని నింపింది. 

జాతీయ జెండా సాక్షిగా భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్, కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన శిరీష (30) 11యేళ్ల కిందట ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు. వీరికి 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శిరీష నాలుగేళ్లుగా అంగన్వాడిలో ఆయాగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబకలహాలు జరుగుతున్నాయి. దీంతో శిరీష భర్తకు దూరంగా కేశవపట్నంలోనే ఉంటుంది. విడాకుల కోసం భర్తకు నోటీసులు పంపించింది.

సోమవారం అంగన్వాడీ కేంద్రం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణలో ఆమె పాల్గొంది. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి ప్రవీణ్ వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకు వెళ్ళాడు. జనం అంతా చూస్తూ ఉండగానే కత్తితో గొంతు కోయడంతో.. ఆమె ఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచింది. కుమార్ అనే యువకుడు అడ్డుకోగా.. అతడిని కూడా కత్తితో పొడిచాడు. దీంతో అతడికి  చిన్న గాయం అయ్యింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో… వారు అక్కడికి చేరుకునేసరికే నిందితుడు పరారీలో ఉన్నాడు. 

కర్ణాటక బీదర్ లో రోడ్డు ప్రమాదం: హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మృతి

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానేలో షాకింగ్ ఘటన జరిగింది. థానేలోని ముంబ్రాకు చెందిన 23 ఏళ్ల యువకుడు గర్భిణి అయిన తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మృతురాలు ముస్కాన్ అలియాస్ నదియా ముల్లాగా, నిందితుడిని ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అల్తమాష్ దల్వీగా గుర్తించారు.

అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృపాలి బోర్సే తెలిపిన వివరాల ప్రకారం... శనివారం మధ్యాహ్నం 3-5.30 గంటల మధ్య విరాని ఎస్టేట్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడు పదునైన ఆయుధంతో ముల్లా గొంతు కోశాడు. ఆ తరువాత నిందితుడు ముంబ్రా నుండి పారిపోబోతున్నాడని తమకు సమాచారం అందిందని, దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు థానే రైల్వే స్టేషన్ సమీపంలో అతనిని పట్టుకుని ముంబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని తెలిపారు. విచారణలో, తనకు, మృతురాలికి మధ్య రెండేళ్లుగా సంబంధం ఉందని, వారి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కొన్ని నెలల క్రితం తామిద్దరం విడిపోయామని దాల్వీ పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితమే ఆమెకు అబార్షన్ అయ్యిందని, ఆ తర్వాత తామిద్దరి మధ్య మాటలు లేవని చెప్పాడు.

వారు విడిపోయిన తర్వాత, దాల్వీ తల్లిదండ్రులు అతనికోసం సంబంధాలు చూస్తున్నారు. నవీ ముంబైలో ఉన్న ఒక అమ్మాయితో అతని వివాహాన్ని నిశ్చయించారు. కానీ ముల్లా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ చేసింది. దీంతో నిందితుడికి విపరీతమైన కోపం వచ్చింది.. ఆ తరువాత తాను మళ్లీ గర్బవతినయ్యానని.. దానికి అతడే కారణం అని.. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించింది. అతను ఆమెకు దాదాపు రూ.1.5 లక్షలు చెల్లించాడు. ఆమె ఇంకా కావాలని అడుగుతుండడంతో మాట్లాడదాం రమ్మని ఒక దగ్గరికి పిలిచాడు. అక్కడ ఆమె గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios