ఖమ్మం: కరోనా సోకి హోం క్వారంటైన్ లో వుంటున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదని... భర్తే చంపాడని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. కరోనా సోకడానికి భార్యే కారణమని భావించి కోపాన్ని పెంచుకున్న భర్తే ఆ దారుణానికి పాల్పడినట్లు మృతురాలి కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామానికి  చెందిన చల్లా నాగరాజు, రామలక్ష్మి దంపతులు. ఇటీవల భార్యభర్తలకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. అయితే ఆరోగ్య సమస్య అంత తీవ్రంగా లేకపోవడంతో హోం క్వారంటైన్ లో వుడాలని వైద్యులు సూచించారు. 

read more   అదొక్కటి మినహాయిస్తే... తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఇలా హోంక్వారంటైన్ లో వున్న రామలక్ష్మి ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో మృతదేహాన్ని గుర్తించింది మృతురాలి తల్లి. దీంతో వెంటనే ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆదారాలను సేకరించి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

దంపతులిద్దరు హోంక్వారంటైన్ లో ఎప్పుడూ ఇంట్లోనే వుండగా ఆత్మహత్య ఎలా చేసుకుంటుందన్న అనుమానాన్ని మృతురాలి తల్లి వ్యక్తం చేస్తోంది. ఇంట్లో మంటలు చెలరేగినట్లుగా గోడలు మసి పట్టి ఉండటం, మృతురాలి మొహం కాలిన గాయాలతో నల్లగా మారడం, ఆమె ఒంటిపై వున్న బట్టలు కూడా మసిపట్టి ఉండటంతో ఈ మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. తన వల్లే కరోనా సోకిందంటూ భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త గొడవపడుతున్నాడని... ఈ క్రమంలో అతడే ఆమెను హతమార్చినట్లు మృతురాలి కుటుంబం ఆరోపిస్తోంది.