అతనికి అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ... మరో యువతిని చూసి మనసు పారేసుకున్నాడు. తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచిపెట్టి... ఆమెను ప్రేమలోకి దింపాడు. ఆమె పెద్దలకు తెలీకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇంటికి తీసుకువెళ్లమని ఆమె ఒత్తిడి  చేయడంతో... నిజం ఎక్కడ తెలిసి పోతోందో అని భయపడ్డాడు. భవనంపై నుంచి కిందకు తోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఎల్బీనగర్  లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... మహారాష్ట్ర గోండియా జిల్లాకు చెందిన తిలక్ చంద్ సుందర్ లాల్ లిహారే అలియాస్ దిలీప్(28)కి 2014లో వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు. భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేసే దిలీప్... కూలీగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీమా దమాహే(22) అనే యువతిపై మనసు పారేసుకున్నాడు.

తనకు పెళ్లి అయ్యిందన్న విషయాన్నిదాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి కాపురం పెట్టాడు. తమకు చెప్పకుండా తమ కుమార్తెను వివాహం చేసుకున్నాడని దిలీప్ పై సీమ తల్లిదండ్రులు  అక్కడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా.. హైదరాబాద్ కి వచ్చిన దిలీప్... కొత్త భార్యతో కలిసి వనస్థలీపురంలో ఓ భవనంలో పనికి కుదిరారు.

అయితే... భర్త తీరుపై సీమ అనుమానం కలుగుతూ వస్తోంది. పెళ్లి చేసుకున్నాడనే గానీ... వాళ్ల ఇంటికి తీసుకువెళ్లడం లేదని...  పెద్దలకు ఎందుకు పరిచయం చేయడం లేదని ఆమె దిలీప్ ని ప్రశ్నించింది. ఈ విషయంలో తీవ్రంగా ఒత్తిడి చేయడంతో... తనకు ముందే పెళ్లి జరిగిందన్న విషయం తెలిసిపోతుందేమనని భయపడ్డాడు. 

దీంతో తాము పనిచేస్తున్న భవనం పై నుంచి సీమను కిందకు తోసేశాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.