ఆమెను ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పెద్దలను ఎదురించి మరీ ఆమె మెడలో తాళి కట్టాడు. ప్రేమించినవాడే భర్తగా రావడంతో ఆమె సంబరపడిపోయింది. కానీ ఆ సంబరం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమెను నలుగురు బిడ్డలకు తల్లిని చేశాడు. ఆ తర్వాత నుంచి కట్నం కావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగలేదు.. ఆమెపై అనుమానం కూడా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పీకలదాకా మద్యం సేవించి వచ్చి బాలింత అని కూడా చూడకుండా భార్యను హీటర్ తో కొట్టి చంపేశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని ఇందిరానగర్ లో నివసించే రుడావత్ అనిల్(31) వికారాబాద్ జిల్లాకు చెందిన అనిత(29) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనిల్..  సినిమా సెట్టింగులు, వేదికల అలంకరణ సామాగ్రి అద్దెకిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా.. నెల క్రితం మరో బాబు పుట్టాడు.

కాగా.. కొంతకాలంగా అనిల్.. భార్య అనితను కట్నం కోసం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అది మనసులో పెట్టుకున్నాడు. శనివారం రాత్రి పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలోనే హీటర్ తో భార్యను విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. కనీసం పచ్చి బాలింత అనే కనికరం కూడా లేకుండా ప్రవర్తించాడు. పెద్ద కూతురు.. అమ్మని ఏమీ చెయ్యద్దు నాన్న అని వేడుకున్నా కూడా కనికరించకపోవడం బాధాకరం. కాగా..తాను కొట్టిన దెబ్బలకు భార్య చనిపోయిన విషయాన్ని గ్రహించి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు పిల్లలు తల్లి కోసం గుక్కపట్టి ఏడ్వటం స్థానికులను కలచివేసింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.