హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పక్కా ప్రణాళిక ప్రకారం భర్త హత్య చేశాడు. ఈ సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. 

సీతాఫల్ మండి పార్థీవాడకు చెందిన శకతాల దర్శన్ ఈసీఐఎల్ లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య సౌందర్య (25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిది ప్రేమ పెళ్లి.

భార్యాభర్తలు ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. అయితే, ఇరువురు కూడా గత కొంత కాలంగా గొడవలు పడుతూ వస్తున్నారు .దాంతో సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ నిర్ణయించుకున్నాడు. అయితే, పెద్దల జోక్యంతో కలిసి ఉంటున్నారు.

అయితే, భార్యను హతమార్చాలని దర్శన్ ప్రణాళిక వేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం భార్యాభర్తలు ఇద్దరు మితిమీరి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సౌందర్యను దర్శన్ చంపేశాడు. టవల్ ను గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.