కోడికూర వండలేదని ఓ భర్త కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక భార్య చనిపోయిన దారుణ ఘటన నాగర్ కర్నూల్ లో జరిగింది. వివరాల్లోకి వెడితే నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన నిమ్మల సన్నయ్య, సీతమ్మ భార్యభర్తలు. 

సోమవారంనాడు సన్నయ్య చికెన్ తెచ్చి భార్య సీతమ్మకు ఇచ్చి వండి పొలం దగ్గరికి తీసుకురమ్మని చెప్పి వెళ్లాడు. అయితే సీతమ్మ కోడికూర వండకుండా వేరే కూర వండుకుని తీసుకెళ్లింది. 

దీంతో కోపానికి వచ్చిన సన్నయ్య కర్రతో సీతమ్మను చితకబాదాడు. దీంతో సీతమ్మ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను అలాగే సాయంత్రం వరకు వదిలేసి.. సాయంత్రం ఎవరూ చూడకుండా ఇంటికి మోసుకొచ్చి, ఇంట్లో పడుకోబెట్టి తాళం వేసి వెళ్లాడు.

గొడవ విషయం తెలిసిన ఇరుగు పొరుగు అనుమానంతో తాళం పగలగొట్టి చూడగా సీతమ్మ చనిపోయి ఉంది. సన్నయ్య ఎప్పుడూ ఫుల్ గా తాగి ఉంటాడని, ఆ మత్తులోనే సీతమ్మను కొట్టడంతో చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు.