భర్త నీచత్వం.. స్నేహితుడికి భార్య అశ్లీలచిత్రాలు పంపించి, ఏకాంతంగా గడపాలని ఒత్తిడి....
అదనపు కట్నం కోసం ఓ భర్త నీఛానికి దిగజారాడు. ఏకంగా భార్య అశ్లీల చిత్రాలను స్నేహితుడికి పంపించి.. అతనితో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశాడు.
హైదరాబాద్ : కష్టసుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, తాళి కట్టిన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడో భర్త. పెళ్లైన కొన్నేళ్లకే పెళ్లినాటి ప్రమాణాలను మరిచిపోయి కీచకుడిగా మారాడు. పెళ్లైన కొద్ది రోజుల బాగానే ఉన్నా.. ఇటీవల కొంతకాలంగా ఇలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడం ప్రారంభించాడు. ఖర్చులకు డబ్బు లేక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అనుకున్నది జరగక పొయేసరికి నీచానికి తెగించాడు. పడక గదిలో తామిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా.. తన ఫోన్లో వాటిని రికార్డ్ చేశాడు. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా స్నేహితుడికి పంపించాడు.
ఈ విషయం భార్యకు తెలిసి భర్తను నిలదీసింది. దీంతో తన స్నేహితుడితో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశాడు. జరిగిన ఘోరాన్ని అత్తమామల దృష్టికి తీసుకువెళ్లగా.. కుమారుడు చేసిన నిర్వాకాన్ని వారూ సమర్ధించారు. అదనపు కట్నం తేవాలని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా భర్త బంధువులు ఆమె మీద దాడి కూడా చేశారు. ఈ వేదన భరించలేక ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తా మామలతో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేశారు. శంషాబాద్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్ కు చెందిన ఓ వ్యాపారి 2016లో ఓ మహిళ (27)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో ఐదు లక్షల నగదు, తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, లక్షల రూపాయల విలువైన ఇతరత్రా గృహోపకరణాలను తీసుకున్నాడు. ఆ తరువాత కొద్ది కాలానికే అదనపు కట్నం వేధింపులు మొదలుపెట్టాడు.
ఒకే మహిళతో రెండు సార్లు పెళ్లి.. మరో మహిళతో సహజీవనం, కట్నం వద్దంటూనే ఆస్తికోసం అరాచకం..
ఇదిలా ఉండగా, తమిళనాడు నారాయణవనం మండలంలోని కైలాసకోన కొండపై గతనెల భర్త చేతిలో హత్యకు గురైన వివాహిత మృతదేహం ఆనవాళ్లను పోలీసులు ఆదివారం కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా సింగూర్ ప్రాంతానికి చెందిన మదన్, తమిళ సెల్వి మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మదన్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో పాటు.. భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు.దీంతో వరకట్నం పేరుతో తరచు వేధిస్తుండేవాడు. జూన్ 25న తమిళ సెల్వితో కలిసి కైలాసకోనకు వచ్చాడు. ఆమెను కొండమీద ఉన్న బావుల సమీపంలోని అటవీ ప్రాంతం వద్దకు తీసుకువెళ్లి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కూతురు కనిపించకపోవడం.. ఆమె తల్లిదండ్రులు మణ్ గండన్, పల్గీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిమదన్ నుఅదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు మదన్ చెప్పుకొచ్చాడు. ఆమెను కైలాసకోన కొండపైకి తీసుకు వెళ్లానని, తమ మధ్య గొడవ జరిగిందని, కత్తితో పొడిచానని చెప్పాడు. ఆ తరువాత ఆమె తీవ్రంగా గాయపడటంతో.. అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసానని చెప్పాడు. గంజాయి మత్తులో ఉండడంతో ఆ ప్రాంతం సరిగా గుర్తు లేదు అని కూడా చెప్పాడు. నిందితుడు చెప్పిన సమాచారం ప్రకారం తమిళనాడు ఎస్సై రమేష్ కైలాసపురంలో ప్రత్యేక బృందంతో తమిళసెల్వి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నెలరోజుల తర్వాత ఆదివారం ఉదయం కొండపై తమిళసెల్వి దుస్తులు, మెట్టెలు, పాదరక్షలు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించి పంచనామా చేపట్టారు.